75 ఏండ్ల కానుక : త్వరలో కనీస వయసులో మార్పులు..!
కనీస వయస్సులో మార్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. వివాహం, ఇంటర్నెట్ సర్ఫింగ్ కోసం యువతీయువకుల కనీస వయస్సును కేంద్ర ప్రభుత్వం మార్చనున్నది. 75 వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికల్లా ఈ నిర్వచనానికి కొత్త రూపం ఇచ్చి ప్రకటించాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తున్నది. సమీప భవిష్యత్‌లో కనీస చట్టపరమైన వయస్సుకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఈ నిబంధనల్లో ముఖ్యంగా అబ్బాయిలు, అమ్మాయిల వివాహ వయస్సు ఒకేలా ఉండనున్నది. సిగరెట్-పొగాకు వాడకంతోపాటు మద్యం సేవించడానికి కనీస వయస్సు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నది.
వివాహానికి సంబంధించి అమ్మాయిలు, అబ్బాయిల కనీస వయస్సుపై టాస్క్‌ఫోర్స్ నివేదికపై నీతి ఆయోగ్ ఇప్పటికే రెండు సమావేశాలు నిర్వహించి చర్చించింది. సాధ్యమైన వివాహం కనీస వయస్సు 21 సంవత్సరాలుగా ఉండనున్నది. ఈ విషయాన్ని రానున్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కనీస వయస్సులో మార్పును పరిశీలిస్తామని గతంలోనే ప్రధాని మోదీ ప్రకటించారు.
పార్లమెంటరీ కమిటీ నివేదిక సిద్ధం
డాటా రక్షణ బిల్లుపై పార్లమెంటు సంయుక్త కమిటీ నివేదిక ఖరారవుతున్నది. దీనిలో ఇంటర్నెట్ సర్ఫింగ్ కోసం పిల్లల కనీస వయసును నిర్ణయించనున్నారు. యుఎస్, ఐరోపాలోని చాలా దేశాలలో 13 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు పిల్లలను పెద్దలుగా పరిగణించి ఇంటర్నెట్ సర్ఫింగ్‌కు అనుమతిస్తున్నారు.
భారతదేశంలోని సోషల్ మీడియా సంస్థలు పార్లమెంటరీ కమిటీ ముందు ఇదే వాదన చేశాయి. సిగరెట్ స్మోకింగ్, పొగాకు వినియోగం వయస్సును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచే ముసాయిదా బిల్లు కూడా సిద్ధంగా ఉంచారు. ఈ బిల్లుతో విమానాశ్రయాలు, రెస్టారెంట్లలో స్మోకింగ్ గదుల వ్యవస్థ రద్దవనున్నది.
మద్యం తాగేందుకు కనీస వయస్సును నిర్ణయించే హక్కు రాష్ట్రాలకు ఉన్నది. కనీస వయస్సు 25 సంవత్సరాలు కావాలని చాలా కాలంగా ఒత్తిడి ఉంది. ఉమ్మడి జాబితాలో మద్యం తీసుకురావడం అవసరం అనే డిమాండ్ కూడా ఉన్నందున దీనిపై కూడా కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.