జమ్మూ లో వైభవంగా శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంఖుస్థాపన…


జమ్మూ సమీపంలోని మజీన్ గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి ఆదివారం వైభవంగా శంఖుస్థాపన నిర్వహించారు.
యాగశాలలో అర్చకులు, వేద పండితులు గణపతి పూజ, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ట, వాస్తుహోమం జరిపారు. టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి యాగశాలలోని కలశ జలాలను శంఖు స్థాపన ప్రాంతానికి తీసుకుని వచ్చి శిలను అభిషేకించారు.
అనంతరం అర్చకులు అక్కడ శిలాన్యాస పూజ నిర్వహించారు. ఈ సందర్బంగా నవరత్నాలను వాటి స్థలంలో ఉంచి వాటి మీద శిలను ఉంచి చతుర్వేదాలను, అష్ఠదిక్పాలకులను ఆవాహనం చేశారు. పంచగవ్యాలతో శిలను అభిషేకించారు. అనంతరం మహావిష్ణువును ఆరాధించి శిలను భూమిలో ప్రతిష్టించి పూజలు నిర్వహించారు.
జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, కేంద్ర మంత్రులు శ్రీ కిషన్ రెడ్డి, డాక్టర్ జితేంద్ర సింగ్, ఎంపి శ్రీ జగల్ కిషోర్ శర్మ, టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, శ్రీ రామ్ మాధవ్, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ గోవింద హరి స్థానిక అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భూమి పూజ అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్ర మంత్రులు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం నమూనాలను చూసి వివరాలు తెలుసుకున్నారు. తరువాత శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు.

18 నెలల్లో జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణం పూర్తి
– కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా హిందూ ధర్మ ప్రచారం
టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

జమ్మూ కు సమీపంలోని మజీన్ గ్రామంలో శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఆలయ నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు దేశవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారానికి పాలకమండలి నిర్ణయం తీసుకుందన్నారు. ఇందులో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాలు నిర్మించాలని సంకల్పించినట్లు ఆయన వివరించారు. కన్యాకుమారి లో ఇప్పటికే స్వామివారి ఆలయం నిర్మించామన్నారు. జమ్మూలో స్వామివారి ఆలయ నిర్మాణానికి ఏడాది నుంచి ప్రయత్నాలు చేసినట్లు శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు. టీటీడీ విజ్ఞప్తి మేరకు జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం టీటీడీ కి 62. 10 ఎకరాల భూమి కేటాయించిందన్నారు. కోవిడ్ కారణంగా ఆలయ నిర్మాణానికి సంబంధించి భూమి పూజ ఆలస్యం అయ్యిందని తెలిపారు.
రూ 33. 22 కోట్లతో పనులు చేపట్టడానికి అనుమతులు మంజూరు చేసినట్లు ఆయన చెప్పారు. తొలి దశలో రూ. 27.72 కోట్లతో ఆలయం, ఉప ఆలయాలు, యాత్రికుల వసతి గృహాలు, నాలుగుమాడ వీధులు, ప్రాకారం, సిబ్బంది వసతి గృహాలు, వాహన మండపం, విద్యుత్, నీటి సరఫరాకు సంబంధించిన పనులు పూర్తి చేస్తామని చైర్మన్ తెలిపారు. రెండవ దశ పనుల్లో రూ 5. 50 కోట్లతో వేద పాఠశాల, ఆరోగ్య కేంద్రం, వేద పాఠశాల హాస్టల్ భవనాలు, కళ్యాణ మండపం నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
జమ్మూ కాశ్మీర్ లోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల సందర్శనకు వచ్చే యాత్రికులు శ్రీవారి ఆలయ దర్శనానికి వచ్చేలా సకల సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆలయ నిర్మాణం దక్షిణ భారత దేశంలో లాగా రాతి కట్టడాలతో నిర్మించనున్నట్లు శ్రీ సుబ్బారెడ్డి తెలిపారు.

————————————————– టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది

About The Author