9 వేల పెట్టుబడికి 60 వేల పంట


తిరుమలగిరి మండలంలోని నెల్లిబండ తండా(పాటి)కు చెందిన యువ రైతు నరేశ్‌ పంట మార్పిడితో మంచి దిగుబడి సాధించాడు. గతేడాది ఎకరం పొలంలో కంది సాగు చేసి పెట్టుపోను ఐదింతల ఎక్కువ ఆదాయం పొందాడు. ప్రభుత్వం వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేయాలని సూచిస్తుండడంతో ఆ మార్గంలో నడుస్తున్నాడు. ఈ ఏడాది కూడా నాలుగు ఎకరాల్లో కంది వేశాడు.
ఆదాయం ఎక్కువనే..
నరేశ్‌కు ఆరు ఎకరాల భూమి ఉంది. అంతకుముందు బోర్ల ద్వారా వరి సాగు చేసేవాడు. వరికి నీటి వినియోగం పెరగడంతోపాటు ఆశించిన దిగుబడి రావడం లేదని గమనించి గతేడాది ఎకరం పొలంలో కంది వేశాడు. ఎకరం దున్నడానికి రూ.2వేలు, మందులకు రూ. 5వేలు, కూలీలకు రూ.2వేలు మొత్తం రూ.9 వేలు పెట్టుబడి ఖర్చు వచ్చింది. ఎకరం కంది సాగుతో 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాకు రూ.6 వేలకుపైనే అమ్మాడు. ఎకరానికి వచ్చిన రైతు బంధు పెట్టుబడితోనే రూ.60 వేల ఆదాయం సంపాదించాడు. ఎకరం వరికి సుమారు రూ.20 వేల పెట్టుబడి అవుతుండగా రూ.40 వేల దిగుబడి మాత్రమే వస్తున్నది. దీంతో నరేశ్‌ ఈ ఏడాది మరో మూడు ఎకరాలు కలిపి నాలుగు ఎకరాల్లో కంది వేశాడు. గతేడాది తాను పండించిన తెలంగాణ ఆశ కంది విత్తనాలనే సాగు చేశాడు. అవే విత్తనాలనే విత్తన శుద్ధి చేసి వాడాడు.
తడులు పెడుతూ..
వరికి నీటి వాడకం ఎక్కువ. రెండెరాలకు సరిపోయే నీటిని ఆరుతడి పంటలకు నాలుగు ఎకరాలకు అందివచ్చు. ఈ విధానాన్ని అనుసరించి కందికి నీటి తడులు పెట్టాడు. పూత దశలో ఒక తడి నీరు అందిస్తే గింజలు గట్టి పడి నాణ్యమైన దిగుబడి వస్తుందని అంటున్నాడు. పూత దశ, మొగ్గదశ, పింద దశలో పలు రకాల మందులు పిచికారీ చేసి మంచి దిగుబడి సాధించాడు.
మద్దతు ధర కంటే ఎక్కువ
కందులకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లించి ట్రేడర్లు కొంటున్నారు. గతేడాది క్వింటాకు మద్దతు ధర రూ.6వేలు ఉండగా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌లో రూ.7,120 అత్యధిక ధర పలికింది.
మంచి దిగుబడి వచ్చింది…
గత సంవత్సరమే మరింతగా కందిసాగు చేస్తే బాగుండని బాధపడ్డాను. ఈ సారి వరిని తగ్గించి నాలుగు ఎకరాల్లో కంది వేసిన. మిగతా రెండెకరాల్లో తిండి మందం వరితోపాటు పత్తి వేస్తా.. కంది సాగుకు పెట్టుబడి ఖర్చు ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు డబ్బులే సరిపోతాయి. ఈ సారి నాలుగు ఎకరాల్లో 2.50 లక్షలకు పైగా ఆదాయం వస్తదని అనుకుంటున్నా. కాలానికి అనుగుణంగా రైతుల పంటలు మార్పు చేస్తే మంచి లాభాలు వస్తాయి.

About The Author