పిల్లలు ఏం చేసినా వాంతులవుతున్నాయా?


కొంతమంది పిల్లలకు తరచూ వాంతులు అవుతుంటాయి. వాళ్లు కడుపునిండా తిన్నతర్వాత లేదా విపరీతంగా నవ్వినా, ఆడినా, పరుగెత్తినా వాంతులు కావచ్చు. అలాంటి లక్షణాలు కనిపిస్తుంటే అది ‘గ్యాస్ట్రో ఈసోఫేజియల్‌ రిఫ్లక్స్‌’ అనే కండిషన్‌ వల్ల కావచ్చు. ఈ కండిషన్‌ ఉన్న పిల్లల్లో లోయర్‌ ఈసోఫేగస్‌ కింది భాగంలోని స్ఫింక్టర్‌ కండరాలు (గట్టిగా పట్టి ఉంచే కండరాలు) కొంచెం వదులుగా ఉంటాయి. దాంతో కడుపులో ఉన్న ద్రవాలు (యాసిడ్‌ కంటెంట్స్‌) కడుపు నుంచి ఈసోఫేగస్‌ వైపునకు నెట్టినట్లుగా పైకి తన్నుకుంటూ వస్తాయి. అలా కడుపులోని ద్రవాలు పైకి తన్నడాన్నే ‘రిఫ్లక్స్‌’ అంటారు. దాంతో ఇలా వాంతులు అవుతుంటాయి.

చాలామంది చిన్నపిల్లల్లో ఈ రిఫ్లక్స్‌ ఎంతోకొంత కనిపిస్తుంటుంది. ఈ రిఫ్లక్స్‌ తీవ్రంగా ఉన్నవాళ్లలో పుట్టిన మొదటి 10 రోజుల్లో /ఆరు వారాల్లో బయటపడతాయి. రెండేళ్ల వయస్సు వచ్చేనాటికి ఈ సమస్య చాలామంది పిల్లల్లో దానంతట అదే తగ్గిపోతుంది. అయితే కొద్దిమంది పిల్లల్లో మాత్రం ఇది పెద్దయ్యాక కూడా కనిపించవచ్చు. కొంతమందిలో ఈ రిఫ్లక్స్‌ తీవ్రంగా ఉన్నప్పుడు దగ్గుతూ ఉండటం, ఆస్తమా, నిమోనియా, ఎదుగుదలలో లోపాలు (గ్రోత్‌ రిటార్డేషన్‌), ఈసోఫేగస్‌లో స్ట్రిక్చర్‌ వంటి సమస్యలు కూడా కనిపించవచ్చు. కొంతమందిలో ఇవే లక్షణాలతో ‘హయటస్‌ హెర్నియా’ అనే కండిషన్‌ మరో సమస్య కూడా కనిపిస్తుంటుంది.

పెద్దవాళ్లలోనూ ఉండవచ్చు…
కొందరు పెద్దవాళ్లలోనూ ఈ రిఫ్లక్స్‌ సమస్య ఉంటుంది. మరీ ముఖ్యంగా ఊబకాయం (ఒబేసిటీ) ఉన్నవాళ్లలో ఇది ఎక్కువ. అలాగే కాఫీలు, సిగరెట్లు ఎక్కువగా తాగడం, తరచూ ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకోవడం వంటి అలవాట్లు ఉన్నవారిలో ఇది ఎక్కువ.

భోజన ప్రియులైన కొందరిలో భోజనం ఎక్కువ పరిమాణంలో తీసుకున్న తర్వాత, అందునా కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారిలోనూ ఈ రిఫ్లక్స్‌ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. కొన్ని సరిపడని మందుల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. మరికొంతమంది కుటుంబ ఆరోగ్య చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ)లో ఈ సమస్య ఉన్నప్పుడు వారి కుటుంబ సభ్యుల్లోనూ ఇది వచ్చేందుకు అవకాశం ఎక్కువ.
నిర్ధారణ పరీక్షలు
బేరియం ఎక్స్‌రే, 24 గంటల పీహెచ్‌ మానిటరింగ్, ఎండోస్కోపీ వంటి పరీక్షలతో ఇలాంటి కండిషన్‌ ఉన్న పిల్లల్లో దీన్ని నిర్ధారణ చేసి, తీవ్రతను అంచనా వేయవచ్చు. అయితే కొన్నిసార్లు ఎక్స్‌–రేలో ఇది బయటపడే అవకాశం తక్కువ. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కనిపించే దీని స్వభావంతో ఒక్కోసారి ఇది ఎక్స్‌–రేలో కనిపించకపోవచ్చు.

మేనేజ్‌మెంట్‌ / చికిత్స
చాలామంది పిల్లల్లో ఇది దానంతట అదే తగ్గిపోతుంది. అయితే వాంతులు కావడం ఎక్కువగా ఉంటే ద్రవపదార్థాలు తక్కువగా ఇవ్వడం, ప్రోకైనెటిక్‌ డ్రగ్స్‌ (ఉదాహరణకు సిసాప్రైడ్, మెటాక్లోప్రమైడ్‌ వంటి మందులు), ఎసిడిటీ తగ్గించే మందులు వాడటం వల్ల చాలా మటుకు ఉపశమనం ఉంటుంది. దీంతోపాటు భోజనం చేసిన వెంటనే పడుకోబెట్టకపోవడం, తల కొద్దిగా ఎత్తున ఉంచి పడుకోబెట్టడం, తిన్న వెంటనే పొట్టపై ఒత్తిడి పెంచే (ఇంట్రా అబ్డామినల్‌ ప్రెషర్‌ కలిగించే) యాక్టివిటీస్‌ అవాయిడ్‌ చేయడం వంటివి చేయాలి. అయితే అరుదుగా కొందరిలో ఈ సమస్యను ‘ఫండోప్లెకేషన్‌’ అనే ఆపరేషన్‌ ద్వారా సరిచేయాల్సి రావచ్చు. కానీ అది చాలా అరుదు.

About The Author