బజాజ్ గ్రూప్ @ రూ. 7.5 లక్షల కోట్లు..
వ్యాపార దిగ్గజం బజాజ్ గ్రూప్ తాజాగా 100 బిలియన్ డాలర్ల (రూ. 7.5 లక్షల కోట్ల) మార్కెట్ క్యాప్ మైలురాయిని అధిగమించింది. దీంతో కుటుంబాల సారథ్యంలో నడుస్తూ, ఈ ఘనత సాధించిన దిగ్గజ గ్రూప్‌లలో నాలుగోదిగా నిల్చింది. టాటా, రిలయన్స్, అదానీ గ్రూప్‌లు ఇప్పటికే 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో ఉన్నాయి. జూన్ 25న బజాజ్ గ్రూప్ కొంత సేపు ఈ మైలురాయి దాటినప్పటికీ.. మార్కెట్ క్షీణించడంతో నిలబెట్టుకోలేకపోయింది.అయితే జూలై 6న తిరిగి సాధించింది. డాలరుతో పోలిస్తే 74.55 రూపాయి మారకం ప్రకారం గ్రూప్‌లోని ఎనిమిది లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ 100.6 బిలియన్ డాలర్లకు చేరింది. రూ. 7.5 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌లో సింహభాగం వాటా బజాజ్ ఫైనాన్స్‌దే (సుమారు రూ. 3.7 లక్షల కోట్లు) ఉంది. వివిధ రంగాల్లోకి విస్తరించిన బజాజ్ గ్రూప్‌లో.. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఫిన్‌సర్వ్), బజాజ్ ఆటో వంటివి కీలకంగా ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా బజాజ్ గ్రూప్ స్టాక్స్ గణనీయంగా ర్యాలీ చేశాయి. బజాజ్ హిందుస్తాన్ షుగర్, ముకంద్ వంటివి 279, 118 శాతం మేర ఎగిశాయి.