కర్నాటక కొత్త సీఎం గా బసవరాజ్ బొమ్మై
కర్ణాటక కొత్త సీఎం ఎవరనే సస్పెన్స్‌కు తెరపడింది. బీజేపీ కొత్త శాసనసభాపక్ష నేతగా ఆ రాష్ట్ర ప్రస్తుత హోంమంత్రి బసవరాజ్ బొమ్మై ఎన్నికయ్యారు. దీంతో ఆయన కర్ణాటక తదుపరి సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ రోజు కర్ణాటకలోని బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమైన బీజేపీ హైకమాండ్ ప్రతినిధులు, కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, కిషన్ రెడ్డి.. ఈ అంశంపై ఎమ్మెల్యేలతో చర్చించారు. ఎక్కువమంది ఎమ్మెల్యేల మద్దతుతో ఉన్న బసవరాజ్ బొమ్మను బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు కావాల్సిన పక్రియ దాదాపుగా పూర్తయ్యింది.
బసవరాజ్ బొమ్మై రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు.
ఆయన మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కుమారుడు. జనతాదళ్ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బొమ్మై 2008లో బీజేపీలో చేరారు. 1998,2004లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత షిగ్గావ్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి యడియూరప్పకు ఎస్ఆర్ బొమ్మై అత్యంత సన్నిహితుడు నమ్మకస్తుడు. యడియూరప్ప సైతం తదుపరి ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మైను ఎంపిక చేయాలని అధిష్టానానికి సూచించారనే ఊహాగానాలు వినిపించాయి. బసవరాజ్ బొమ్మై లింగాయత్ సామాజికవర్గానికి చెందడం ఆయనకు కలిసొచ్చిన అంశం.