40 ఎర్రచందనం దుంగలు స్వాధీనం: ఇద్దరి అరెస్టు
రేణిగుంట మండలం చైతన్య పురం వద్ద పట్టుబడిన స్మగ్లర్ అందజేసిన సమాచారం మేరకు ప్రకాశం జిల్లా కొనకల మిట్ట మండలం చిన్నారికట్ల వద్ద దాచి ఉంచిన 35 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందర రావు తెలిపారు. ఆయన శనివారం టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఎస్పీగా తనకు అందిన సమాచారంతో సి ఐ చంద్రశేఖర్, ఆర్ ఐ కృపానంద, ఆర్ ఎస్ ఐ లు పి.లక్ష్మణ్, జివి కుమార్ బృందం కుక్కలదొడ్డి సమీపంలోని, చైతన్య పురం అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టగా, ప్రకాశం జిల్లా చిన్నారి కోట్లకు చెందిన కూకట్ల రమేష్ రెడ్డి (31) అనుమానాస్పదంగా కనిపించాడు. టాస్క్ ఫోర్స్ సిబ్బందిని చూడగానే పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకోగా, అతని వద్ద ఐదు దుంగలు లభించాయి. విచారణ లో కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లి కి చెందిన పుల్లారెడ్డి (36) తనకు ఈ పని అప్పగించినట్లు తెలిపారని చెప్పారు. దీంతో టాస్క్ ఫోర్స్ టీమ్ పుల్లారెడ్డి ని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. ఇతను మరో 35 ఎర్రచందనం దుంగలను చిన్నారికట్ల లో డంప్ చేసినట్లు తెలియజేసినట్లు తెలిపారు. జేసీబీ తో డంప్ ను వెలికి తీశామని, 20 రోజుల క్రితం తీసుకుని వచ్చి డంప్ చేసినట్లు నిందితులు తెలిపారని అన్నారు. మొత్తం 40 దుంగలను స్వాధీనం చేసుకోగా, అవి బలంగా ఉన్న ఏ గ్రేడ్ దుంగలని తెలిపారు. ఇవి 1707 కిలోలు ఉన్నాయన్నారు. ఈ కేసు ను సి ఐ సుబ్రహ్మణ్యం నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విలేకరుల సమావేశంలో సి ఐ లు సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్, వెంకట్ రవి, ఆర్ ఐ కృపానంద, ఆర్ ఎస్ ఐ లు లక్ష్మన్, జివి కుమార్, ఎఫ్ ఆర్ ఓ ప్రేమ తదితరులు పాల్గొన్నారు.