6 గురు స్మగ్లర్లు అరెస్టు : 14 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
చిత్తూరు జిల్లా:భాకరాపేట అడవుల్లో నాగపట్ల ఈస్ట్ బీట్ పరిధిలో ఈతగుంట వద్ద ఎర్రచందనం దుంగలు మోసుకుని వస్తున్న ఆరుగురిని అరెస్టు చేయడంతో పాటు 14 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందర రావుకు అందిన సమాచారం మేరకు ఆర్ ఎస్ ఐ లు లింగాధర్, సురేష్ బాబు ఎఫ్ బి ఓ కోదండన్ ల టీమ్ శ్రీవారిమెట్టు రోడ్డు నుంచి చామల రేంజి నాగపట్ల బీట్ లో శనివారం కూంబింగ్ చేపట్టారు. వీరు చీకటీగల కోన, సచ్చినోడి బండ ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు. ఈతగుంట ప్రాంతంలో కొంతమంది స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలు మోసుకుని వస్తూ కనిపించారు. వీరిని టాస్క్ ఫోర్స్ టీమ్ చుట్టుముట్టే ప్రయత్నం చేయగా ఆరుగురు పట్టుబడ్డారు. సమీపంలో14 దుంగలు లభించాయి. పట్టుబడిన వారు తమిళనాడు తిరువణ్ణామలై జిల్లాకు చెందిన అర్జున్, ప్రకాష్, దక్షిణామూర్తి, అచ్యుతన్, శశి కుమార్, విజయ్ లుగా గుర్తించారు. వీరిలో ఇద్దరిని జువెనెల్ హోం కు తరలించారు. నలుగురు ని విచారించగా తాము 16 మంది ఆరు రోజుల క్రితం వచ్చినట్లు తెలిపారు. దాదాపు మూడు రోజుల పాటు శేషాచలం అడవుల్లో నడిచి వెళ్లి, ఎర్రచందనం దుంగలను సేకరించి నట్లు తెలిపారు. సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి ఎస్పీ మేడా సుందర రావు, ఆయనతో పాటు సిఐ లు వెంకట రవి, సుబ్రమణ్యం ఎఫ్ ఆర్ ఓలు ప్రసాద్, ప్రేమ, ఆర్ ఎస్ ఐ విశ్వనాధ్ చేరుకున్నారు. స్మగ్లర్లు ను సాహసోపేతంగా పట్టుకున్న సిబ్బందికి ఎస్పీ రివార్డులు ప్రకటించారు. ఈ కేసును ఎస్ ఐ మోహన్ నాయక్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.