ఆగస్టులో 15 కిలోల రేషన్‌ బియ్యం


రేషన్‌ దుకాణాల ద్వారా ఆగస్టు నెలలో పదిహేను కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర నిర్ణయం మేరకు జూలై నుంచి నవంబర్‌ వరకు నెలకు పది కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేయాల్సి ఉన్నా, వివిధ కారణాలతో జూలైలో 5 కిలోలే పంపిణీ చేశారు. ఈ నెలలో జూలై కోటా కలుపుకొని 15 కిలోల బియ్యాన్ని పాత కార్డుదారులందరికీ పంపిణీ చేయనుంది. ఈ నేపథ్యంలో అన్ని రకాల ఆహార భద్రతా కార్డులు కలిగిన వారికి ఒక్కొక్కరికి 15 కిలోలు, కొత్తగా ఈ కార్డులు పొందిన వారికి ఒక్కొక్కరికి 10 కిలోలు, అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోలు ఉచితంగా ఇవ్వాలని పౌర సరఫరాల కమిషనర్‌ అనిల్‌కుమార్‌ శుక్రవారం అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటే అంత్యోదయ కార్డుదారులకు కుటుంబానికి కిలో చక్కెరను రూ.13.50కి, గోధుమలు జీహెచ్‌ఎంసీ పరిధిలో 3 కిలోలు, మునిసిపల్‌లో 2 కిలోలు, కార్పొరేషన్‌లో ఒక కిలో చొప్పున కిలో రూ.7కు ఇవ్వాలని ఆదేశించారు.

About The Author