తెలంగాణా రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోం బంద్…!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోకీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి వర్క్ ఫ్రమ్ హోంను బంద్ చేయనుంది. గత యేడాది మార్చి నెల నుంచి కరోనా మహమ్మారి కారణంగా పలు ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పించాయి.కరోనా పూర్తిగా తగ్గేవరకు వారు ఇంటి నుంచే పని చేసుకోవచ్చని ఆయా సంస్థలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఇప్పట్లో పూర్తి స్థాయిలో కార్యాలయాలను తెరవడానికి ఐటీ కంపెనీలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి.
తాజాగా పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయ కంపెనీల ప్రతినిధులకు ఆయన పలు సూచనలు చేశారు. ఇకపై వర్క్ ఫ్రం హోం వద్దని, ఉద్యోగులను క్రమంగా కార్యాలయాలకు పిలిపించాలని ఆయా కంపెనీలను కోరారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి కూడా 100 శాతం మంది ఉద్యోగులు పని చేసేలా చూస్తున్నామని ఈ సమావేశంలో జయేశ్ రంజన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఐటీ కంపెనీలు 100 శాతం మంది ఉద్యోగులను కార్యాలయాల నుంచే పనిచేసేలా చూడాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు సెప్టెంబరు 1 నుంచే కార్యాలయాల నుంచే ఉద్యోగులతో పనులు చేయించేలా చూడాలని చెప్పింది. ఇందుకు ఐటీ సంస్థలు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది. అయితే ప్రభుత్వ సూచన పట్ల పలు ఐటీ సంస్థలు విముఖత వ్యక్తం చేశాయి. వర్క్ ఫ్రం హోం వల్ల తమ ఉద్యోగులు మరింత మెరుగ్గా పనిచేస్తున్నారని చెప్పాయి. గూగుల్, కాగ్నిజెంట్ వంటి పెద్ద కంపెనీలు కూడా అక్టోబరు వరకు వర్క్ ఫ్రం హోం ఇస్తామని ఇప్పటికే ప్రకటించాయని పలు కంపెనీల ప్రతినిధులు గుర్తు చేశారు. వర్క్ ఫ్రం హోం వల్ల అవుట్ పుట్ ఎక్కువగా వస్తోందన్నారు.