ఆగస్టు నెలంతా ప్రవేశ పరీక్షలు…
వివిధ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అవి నెలంతా కొనసాగనున్నాయి. ఈ పరీక్షలకు రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నారు. ముందుగా మంగళవారం (నేడు) ఈ–సెట్ జరగనుంది. దీన్ని రెండు విడతలుగా నిర్వహిస్తారు. మొదటి విడత ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో విడత మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షను 24 వేల మందికిపైగా రాయనున్నారు.దీనికోసం 41 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. ఇక ఈ నెల 4 నుంచి ఎంసెట్‌ను నిర్వహిస్తున్నారు. కోవిడ్ వచ్చిన వారికి పరీక్ష తేదీలను రీషెడ్యూల్ చేస్తారు. 4, 5, 6వ తేదీల్లో ఇంజనీరింగ్‌కు, 9, 10 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. దీనికోసం తెలంగాణలో 82 కేంద్రాలు, ఏపీలో 23 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ చెప్పారు. ఈ ప్రవేశ పరీక్షలను కూడా రెండు విడతలుగా నిర్వహిస్తారు.
తొలి విడత ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో విడత మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు. ఎంసెట్‌కు మొత్తం విద్యార్థులు 2,51,132 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో ఇంజనీరింగ్ 1,64,678 మంది, మెడికల్ 86,454 మంది రాస్తున్నారని తెలిపారు. అలాగే, ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు బిట్స్ ప్రవేశ పరీక్ష జరుగనుంది. మరోవైపు ఈ నెల 4వ తేదీన డిగ్రీ సీట్లను కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలోని డిగ్రీ సీట్లను దోస్త్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ సీట్ల కోసం దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
కరోనా జాగ్రత్తల మధ్య పరీక్షలు…
కరోనా సెకండ్ వేవ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోనూ పలు జిల్లాల్లో కేసుల పెరుగుదల కనిపిస్తోంది. మరోవైపు థర్డ్‌వేవ్‌కు సంబంధించి హెచ్చరికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెలలో జరిగే ప్రవేశ పరీక్షలకు అన్ని రకాల కోవిడ్ జాగ్రత్తలు చేపట్టినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్ లింబాద్రి తెలిపారు. శానిటైజర్లు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భౌతిక దూరం ఉండేలా విద్యార్థులకు సీట్లను కేటాయిస్తున్నామని చెప్పారు. పరీక్షా హాలులోకి ప్రవేశించే ముందు జ్వరం చూస్తారని, విద్యార్థులు మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. సెల్ఫ్ డిక్లరేషన్ ఫాం ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరికైనా కోవిడ్ ఉంటే వారి విన్నపం మేరకు తదుపరి.. పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.