‘పోయిన పరువు తిరిగి తీసుకురాగలరా’… క్యాబ్‌ డ్రైవర్‌ ఆవేదన


రెండు రోజుల క్రితం లక్నోకు చెందిన ఓ యువతి క్యాబ్ డ్రైవర్‌ను కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. క్యాబ్‌ డ్రైవర్‌ తనను ఢీకొన్నాడని.. అతడిని కొట్టింది. ఇక సదరు మహిళ ఫిర్యాదు మేరకు ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు క్యాబ్‌ డ్రైవర్‌ని అరెస్ట్‌ చేశారు. అయితే ఆ తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన రెండో సీసీటీవీ కెమరా ఫుటేజ్‌లో సదరు యువతి చెప్పినదానికి.. అక్కడ జరిగిన దానికి ఏమాత్రం పొంతన లేదు. ఈ వీడియో చూసిన జనం.. ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక తనకు జరిగిన అవమానం మాటేంటి.. పోయిన పరువు మళ్లీ తిరిగి వస్తుందా అని క్యాబ్‌ డ్రైవర్‌ ప్రశ్నిస్తున్నాడు. అసలు ఇంతకు ఆ రోజు ఏం జరిగిందో క్యాబ్‌ డ్రైవర్‌ మాటల్లోనే..

క్యాబ్‌ డ్రైవర్‌ మాట్లాడుతూ.. ‘‘ఎప్పటిలానే నేను ఆ రోజు క్యాబ్‌ డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్తున్నాను. ట్రాఫిక్‌ నియమాలను పాటిస్తూ.. అలంబాగ్ నహరియా చౌరహా సిగ్నల్ వద్ద వేచి ఉన్నాను. ఇంతలో సదరు మహిళ రోడ్డు మీద అజాగ్రత్తగా నడుస్తూ కనిపించింది. దాంతో నేను నెమ్మదిగా వెళ్తున్నాను. ఇంతలో ఉన్నట్టుండి ఆమె వెనక్కి వచ్చి నాపై దాడి చేసింది. మొబైల్‌ విసిరికొట్టింది’’ అని తెలిపాడు.

‘‘కాసేపటికి అక్కడ జనాలు మూగడంతో సమస్య మరింత పెద్దదయ్యింది. నా మాట ఎవరు వినిపించుకోలేదు. విషయం పోలీసుల దాకా వెళ్లింది. ఈ ఘటనలో నా కారు డామేజ్‌ అయ్యింది. మొత్తం మీద నాకు 60 వేల రూపాయల నష్టం వాటిల్లింది. వీటన్నింటికి మించి నా ఆత్మాభిమానం దెబ్బతిన్నది.. పరువు పోయింది. నా తప్పు లేకున్నా పోలీసు స్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చింది. వీటన్నింటిని తిరిగి సరిచేయగలా.. నా పరువు తెచ్చివ్వగలరా’’ అని ప్రశ్నిస్తున్నాడు.

ఈ ఘటనకు సంబంధించిన రెండో సీసీటీవీ ఫుటేజ్‌ చూసిన నెటిజనులు సదరు యువతిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఏ తప్పు లేకుండానే క్యాబ్‌ డ్రైవర్‌ని అవమానించారు.. తప్పు చేసిన యువతిని వదిలేయం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

About The Author