ఒకటే కులం.. పైగా ఇద్దరూ క్లాస్‌మేట్స్‌.. ఇద్దరూ డాక్టర్లే!


పెళ్లంటే నూరేళ్ల పంట. కానీ కొందరు అమ్మాయిలకు అదే విష వలయంగా మారుతోంది. పెళ్లికి ముందే ఒకరినొకరు అర్థం చేసుకోవాలని ఏకాంతంగా కలుస్తున్నారు. పెద్దలు కుదిర్చిన సంబంధం.. పైగా కాబోయే భార్యాభర్తలమే కదా అని ఏకాంతంగా మాట్లాడేందుకు అనుమతిస్తున్న అమ్మాయిలు దారుణంగా మోసపోతున్నారు. కాబోయే భర్త ముసుగులో ఉన్న కామాంధులు అమ్మాయిలను వంచించి వదిలేస్తున్నారు. తీరా మోసపోయాక బాధిత యువతులు పోలీసులను, భరోసా కేంద్రాన్ని ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇప్పటివరకు సుమారు 457కు పైగా ఇలాంటి కేసులు నమోదయ్యాయి.
మ్యాట్రిమోనీ సంస్థల ద్వారా..
హైదరాబాద్‌లోని ఓ డీమ్డ్‌ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న కేరళకు చెందిన ఓ అమ్మాయి ప్రముఖ మ్యాట్రిమోనీ సంస్థ ద్వారా ఓ అబ్బాయిని ఎంపిక చేసుకుంది. రెండు కుటుంబాలు వారి పెళ్లికి అంగీకరించాయి. దాంతో ఒకరినొకరు అర్థం చేసుకొనేందుకు తరచుగా కలిసేవారు. అయితే అది కాస్తా వారు శారీరకంగా దగ్గరయ్యే దాకా వచ్చింది. కొద్దిరోజుల తర్వాత అబ్బాయి ఫోన్‌ స్విచాఫ్‌ చేశాడు. ఆందోళనకు గురైన ఆ అమ్మాయి అతడి బంధువులను సంప్రదించగా స్పందన లేదు. చివరకు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఆ అమ్మాయి మోసపోయినట్లుగా కేసు నమోదు చేశారు. ఏడాది కింద ఈ కేసు నమోదైనా ఇప్పటికీ ఆమెకు న్యాయం జరగలేదు. ఈ ఉదంతంలో కొసమెరుపు ఏంటంటే.. సదరు మ్యాట్రిమోని సంస్థ జాబితాలో ఇప్పటికీ అతడు ‘వధువు కోసం ఎదురు చూస్తున్న వరుడే’.
కట్నం కావాల్సి వచ్చింది..
వధూవరులిద్దరిదీ ఒకటే కులం. పైగా ఇద్దరూ క్లాస్‌మేట్స్‌. ఇద్దరూ డాక్టర్లే. చిన్నప్పటి నుంచి తెలిసిన అబ్బాయి కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించారు. గతేడాది మాటా ముచ్చట పూర్తయింది. మంచి రోజులు చూసుకొని పెళ్లి చేయాలని భావించారు. అప్పటికే ఓ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ఆమె అతడిని తన సొంత ఖర్చులతో పీజీలో చేర్పించింది. ఎలాగూ కాబోయే భార్యా భర్తలమనే భరోసాతో శారీరకంగా దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో ఆ వరుడికి ఎక్కువ కట్నం ఇచ్చే మరో సంబంధం వచ్చింది. దాంతో అతడు మొదటి వధువుతో మాట్లాడటం మానేశాడు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల సమక్షంలో అతడు తన తప్పును అంగీకరించి, అమ్మాయిని నెల రోజుల్లో పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. ఇప్పటికి 3 నెలలు దాటింది. ఆమె తనను పోలీసుల ద్వారా వేధింపులకు గురి చేసిందంటూ ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నాడు.
వందల్లో బాధితులు..
నగరానికి చెందిన ఓ యువతి వరంగల్‌ జిల్లాలో ఏఎన్‌ఎంగా పని చేస్తోంది. తన కంటే రెండేళ్లు చిన్నవాడైనా కూడా తెలిసిన అబ్బాయి అని చేరదీసి చదివించింది. ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం లభించింది. కొద్దిరోజుల్లో తాము పెళ్లి చేసుకుంటామని ఆమె కలలు కంటున్న తరుణంలో.. ఆ అమ్మాయి తనకంటే పెద్దదని, తాను పెళ్లి చేసుకోనని తెగేసి అతడు చెప్పాడు. దీంతో మోసపోయానని గుర్తించిన ఆమె పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. పెళ్లికి ముందు అభిప్రాయాలు, అభిరుచులను పంచుకోవడం మంచిదే. కానీ కొందరు దీన్ని అవకాశంగా తీసుకొని లైంగిక వంచనకు పాల్పడుతున్నారు. యువతులు అంతగా చనువు ఇవ్వొద్దని పలువురు సూచిస్తున్నారు.
నిర్భయ వంటి వాటికే స్పందిస్తారా
‘మోసంతో పాటు, నమ్మిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఇలాంటి ఉదంతాలను పోలీసులు మోసపోయిన కేసులుగానే నమోదు చేస్తున్నారు. నిర్భయ వంటి సంఘటనల్లో మాత్రమే స్పందించి అత్యాచారం జరిగినట్లు కేసులు నమోదు చేస్తున్నారు. ఇది సరైంది కాదు. పైగా అమ్మాయిలు స్వయంగా తాము అత్యాచారానికి గురైనట్లు కేసులు పెడితే ‘మెడికల్‌ ఎగ్జామినేషన్‌’ఉండాలంటున్నారు. ఇది చాలా అన్యాయం.’

About The Author