వాహనాల ఫిట్‌నెస్‌ టెస్ట్‌.. ఇక ఆటోమేటెడ్‌..


వాహనాల సామర్థ్య పరీక్షలకు ఆటోమేటెడ్‌ యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. మనుషుల ప్రమేయం లేకుండా నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా వాహనాల నాణ్యతను, పనితీరును, వినియోగ అర్హతను ధృవీకరించేందుకు ఆటోమేటెడ్‌ వెహికల్‌ ఫిట్‌నెస్‌ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం తాజాగా ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ మేరకు అక్టోబర్‌ నాటికి గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు అన్ని చోట్ల ఈ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
► ఆటోమెబైల్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఆర్‌ఏఐ) నిర్ధేశించిన ప్రమాణాలకు అనుగుణంగా వాహనానికి సంబంధించిన 40 అంశాలను ఈ ఆటోమేటెడ్‌ ఫిట్‌నెస్‌ కేంద్రాలు తనిఖీ చేసి సదరు వాహనం సామర్థ్యాన్ని నిగ్గు తేలుస్తాయి.
► బస్సులు, లారీలు, ఆటోరిక్షాలు తదితర అన్ని రకాల ప్రయాణికుల రవాణా, సరుకు రవాణా వాహనాలను ఈ ఫిట్‌నెస్‌ కేంద్రాల్లోనే తనిఖీలు చేయవలసి ఉంటుంది.
► ప్రస్తుతం మోటారు వాహన తనిఖీ అధికారులే అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో స్వయంగా తనిఖీలు చేసి వాహనాల సామర్థ్యాన్ని ధృవీకరిస్తుండగా రానున్న ఆ రోజుల్లో ఆ పనిని యంత్రాలు చేయనున్నాయి.
► మరో వైపు ఈ ఆటోమేటెడ్‌ వెహికల్‌ ఫిట్‌నెస్‌ స్టేషన్‌ల (ఏవిఎఫ్‌ఎస్‌) నిర్వహణను పూర్తిగా ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించనున్నారు. ఇప్పటికే డ్రైవింగ్‌ లైసెన్స్‌ల కోసం నిర్వహించే పరీక్షలను పూర్తిగా ప్రైవేట్‌ అక్రిడేటెడ్‌ డ్రైవింగ్‌ స్కూళ్లకు అప్పగించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఫిట్‌నెస్‌ కేంద్రాలను సైతం ప్రైవేటీకరించేందుకు తాజాగా రంగం సిద్ధమైంది.
ప్రైవేట్‌ సంస్థల గుత్తాధిపత్యానికి ఊతం
వాహనాల సామర్థ్యాన్ని నిర్ధారించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వాగతిస్తున్నప్పటికీ..నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్‌ సంస్థలకు కట్టబెట్టడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రైవేట్‌ సంస్థలు ఏ మేరకు కచ్చితమైన ప్రమాణాలను పాటిస్తున్నాయో నిర్ధారించడం సాధ్యం కాదని రవాణాశాఖ సాంకేతిక అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఆటోమేటెడ్‌ వెహికల్‌ టెస్టింగ్‌ సెంటర్లను ఆర్టీఏలే నిర్వహించే విధంగా మార్పులు చేయాలంటున్నారు.
పక్కాగా తనిఖీలు…
► వాహనం ఇంజన్‌ సామర్ధ్యం, బ్రేకులు, టైర్లు, కాలుష్య కారకాల తీవ్రత వంటి ముఖ్యమైన అంశాలు మొదలుకొని వైపర్‌లు, సైడ్‌ మిర్రర్‌లు, షాకబ్జర్వర్స్, డైనమో, బ్యాటరీ తదితర 40 అంశాలను ఈ యంత్రాలు క్షుణ్ణంగా పరీక్షిస్తాయి.
► ఎలక్ట్రికల్, మెకానికల్‌ లోపాలను గుర్తిస్తాయి.
► వాహనాల నుంచి వెలువడిన కాలుష్య కారకాలను గుర్తించి పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌ (పీయూసీ) సర్టిఫికెట్లకు అర్హత ఉన్నదీ లేనిదీ ఈ యంత్రాలే నిర్ధారిస్తాయి.
► గంటకు 30 వాహనాల వరకు తనిఖీలు నిర్వహించే విధంగా పూర్తిస్థాయిలో కంఫ్యూటరీకరించిన ఆటోమేటెడ్‌ వెహికల్‌ ఫిట్‌నెస్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఉంది.
► ప్రస్తుతం మోటారు వాహన ఇన్‌స్టెక్టర్‌లు నిర్వహించే తనిఖీల్లో శాస్త్రీయత కొరవడినట్లు ఏఆర్‌ఏఐ నిపుణులు భావిస్తున్నారు. మొక్కుబడిగా నిర్వహించే ఈ తనిఖీల వల్ల కాలం చెల్లిన, డొక్కు వాహనాలకు తేలిగ్గా అనుమతి లభిస్తుందనే అభిప్రాయం ఉంది.
► ఇలా ఉత్తుత్తి తనిఖీలతో రోడ్డెక్కే వాహనాలు రహదారి భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయి.

About The Author