‘బిడ్డను కనాలనుకుంటున్నాను నా భర్తకు బెయిలివ్వండి’


ఉత్తరాఖండ్‌ హైకోర్టు ముందుకు ఓ వింత పిటిషన్‌ వచ్చింది. ‘‘బిడ్డను కనాలనుకుంటున్నాను.. నా భర్తకు బెయిల్‌ ఇవ్వండి’’ అంటూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. పైగా ఆమె భర్త జైల్లో ఉన్నది అత్యాచార ఆరోపణల మీద. భర్త ఇలాంటి పనులు చేసి జైలుకెళ్తే ఏ భార్య అయినా అతడి నుంచి విడిపోవాలని అనుకుంటుంది. కానీ నువ్వేంటి తల్లి.. ఏకంగా అతడితో బిడ్డను కనాలనుకుంటున్నావ్‌.. అసలు రాజ్యంగా ఖైదీలకు ఇలాంటి ఓ హక్కును కల్పించిందా అనే దాని గురించి పరిశోధించే పనిలో ఉన్నారు అధికారులు. ఆ వివారలు..
ఉత్తరాఖండ్‌కు చెందిన సచిన్ అనే వ్యక్తి, మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసును విచారించిన కోర్టు సచిన్‌తో పాటు మిగిలిన దోషులకు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఇప్పటికి అతడు జైలుకెళ్లి ఏడు సంవత్సరాలు అవుతుంది. పెళ్లైన మూడు నెలలకే భర్త జైలుకెళ్లాడని.. తమకు కలిసి ఉండే అవకాశమే లభించలేదని తెలిపింది సచిన్‌ భార్య. ‘‘మాతృత్వంలోని మాధుర్యాన్ని అనుభవించాలని కోరుకుంటున్నాను. కనుక నా భర్తకు షార్ట్ టర్మ్ బెయిల్ ఇవ్వండి’’ అంటూ సచిన్‌ భార్య హైకోర్టును ఆశ్రయించిది.

తనకు మాతృత్వంలోని మాధుర్యం అనుభవించాలని ఉందని, ఇది భార్యగా తన హక్కు అని ఆమె తన పిటిషన్‌లో పేర్కొంది. తన భర్తకు కొంతకాలం బెయిల్ ఇస్తే తాను గర్భం దాల్చేందుకు అవకాశం ఉంటుందని వేడుకుంది. ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాని న్యాయమూర్తి ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ అలోక్‌ కుమార్‌ వర్మల ధర్మాసనం ఈ పిటిషన్‌ని విచారించింది. గతంలో ఎన్నడూ ఇలాంటి వింత పిటిషన్‌ రాలేదని విచారణ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు. ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా ధర్మాసనం పలు అనుమానాలను లేవనేత్తింది. ఈ క్రమంలో తమకు సలహా ఇవ్వాలని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

కోర్టు వ్యక్తం చేసిన అనుమాలు ఇలా ఉన్నాయి.. ‘‘అత్యాచారం కేసులో దోషిగా నిరూపణై జైలుశిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి బెయిల్ ఇవ్వొచ్చా?.. ఈమె ‘భార్యగా నా హక్కు’ అంటూ కోర్టుకెక్కింది. ఆమె హక్కులను గౌరవించి అతనికి బెయిల్ ఇస్తే వారికి కలిగే సంతానం కూడా వచ్చి ‘బిడ్డలుగా మా హక్కు’ అనే అవకాశం ఉంది కదా’’.. అని హైకోర్టు అభిప్రాయపడింది. పైగా తండ్రి లేని బిడ్డను తల్లి ఒక్కతే పోషించడం చాలా కష్టమైన విషయం, ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు కనడం కోసమే నిందితుడికి బెయిల్ ఇవ్వడం సబబేనా అని కూడా ధర్మాసనం ఆలోచిస్తోందన్నారు.

అలాగే తండ్రి లేకుండా పెరిగే బిడ్డల మానసిక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం కూడా ఉందని కోర్టు అభిప్రాయపడిది. ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తమకు సరిగా తెలియడం లేదని ధర్మాసనం పేర్కొంది. గతంలో ఇలాంటి కేసులేమైనా అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, కెనడా వంటి దేశాల్లో నమోదయ్యాయా.. ఒకవేళ నమోదైతే అక్కడి కోర్టులు ఎలాంటి తీర్పులిచ్చాయి.. అన్న వివరాలతో తమకు నివేదిక సమర్పించాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది. ఈ విషయంలో ప్రభుత్వ అభిప్రాయాన్ని కూడా తెలపాలని హైకోర్టు కోరింది.

About The Author