అసలేం జరిగిందో?: రక్తపు మడుగులో భార్య.. విగతజీవిగా భర్త


రాజమహేంద్రవరంలో శనివారం ఉపాధ్యాయ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సబ్‌కలెక్టర్‌ ఆఫీసు సమీపంలోని సూర్య థియేటర్‌ వద్ద ఎస్‌ఆర్‌ ప్లాజాలో ఉంటున్న నడింపల్లి నర్సింహరాజు(59) నిడదవోలులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. భార్య వెంకటమణి(55) రాజమహేంద్రవరం ఉమెన్స్‌ కాలేజీలో కాంట్రాక్టు అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. వారి కుమారుడు అమెరికాలో చదువుకుంటూ ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి దంపతులిద్దరూ ఎప్పటిలాగే నిద్ర పోయారు. శనివారం మధ్యాహ్నం వరకూ తలుపులు తెరవకపోవడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. పక్కింటివారు కిటికీలోంచి చూడగా రక్తపు మడుగులో మృతదేహాలు కనిపించాయి.

సమాచారం అందుకున్న మూడో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తలుపులు తెరిచి పరిశీలించగా మంచంపై రక్తపు మరకలతో భార్య పడి ఉండగా, భర్త కుర్చీలో చనిపోయి ఉన్నాడు. అతని చేతిలో చాకు ఉంది. భార్య గొంతుకోసి, తాను గొంతుకోసుకుని చనిపోయి ఉంటాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. నర్సింహరాజు భార్యను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా మరేమైనా జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాపు చేస్తున్నారు. కుర్చీలో శవమైన నర్శింహరాజు చేతిలో చాకు కింద పడకుండా ఉండడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.

About The Author