వ్యాక్సిన్ రెండో డోసు తీసుకుంది..మంచంపై పడుకుని నిద్రలోనే మృతి
కోవిషీల్డ్ రెండో తీసుకున్న పెంటమ్మ అనే మహిళ మృతి చెందింది. వ్యాక్సిన్ తీసుకున్న కొద్దిసేపటికే తనకు కళ్లు తిరుగుతున్నాయంటూ మంచంపై పడుకుని నిద్రలోనే మృతి చెందడంతో శనివారం సాయంత్రం పాతబస్తీ ఛత్రినాకలో విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న తమ అమ్మ వ్యాక్సిన్ తీసుకున్న కారణంగానే మృతి చెందిందని.. అనవసరంగా వ్యాక్సిన్ తీసుకుని అమ్మను దూరం చేసుకున్నామని పిల్లలు గుండె పగిలేలా రోదించడం కంటతడి పెట్టించింది. వివరాల ప్రకారం ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన పుష్పాకుల పెంటమ్మ (50) , ముత్తయ్య దంపతులు, వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు సంతానం. ముత్తయ్య జీహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ లేబర్. ఇదిలా ఉండగా పెంటమ్మ గత ఏప్రిల్ నెలలో మొదటి డోస్ కోవిషిల్డ్ వ్యాక్సిన్ తీసుకుంది. రెండు డోసు తీసుకునేందుకు శనివారం గోడేకిఖబర్‌లోని వ్యాక్సిన్ సెంటర్‌కు వచ్చి వ్యాక్సిన్ తీసుకుంది. అనంతరం అరగంట వరకు కూడా పెంటమ్మల డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉంది. అక్కడి నుంచి బయటకు వచ్చిన కొద్ది సేపటికే కళ్లు తిరుగుతున్నాయంటూ మంచం మీద పడుకుంది. ఎంతసేపటికి నిద్ర లేకపోవడంతో ఆమెను చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.