పరిటాల సిద్ధార్థ్‌ వద్ద అక్రమ ఆయుధం?


ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత చిన్న కుమారుడు సిద్ధార్థ్‌ వద్ద అక్రమ ఆయుధం ఉందా? తాజా పరిణామాలను పరిశీలిస్తుంటే ఈ అనుమానాలే కలుగుతున్నాయి. గతంలో అతను లైసెన్స్‌ తీసుకున్న ఆయుధానికి, బుధవారం శంషాబాద్‌ విమానాశ్రయంలో అతని బ్యాగేజ్‌ నుంచి స్వాధీనం చేసుకున్న బుల్లెట్‌కు పొంతన లేకపోవడంతో ఈ అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి. ఈ కేసు దర్యాప్తులో శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
2019లోనే ఆయుధం సరెండర్‌…
పరిటాల సిద్ధార్థ్‌ వ్యక్తిగత కారణాల నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం అనంతపురం కలెక్టర్‌ నుంచి ఆయుధ లైసెన్స్‌ తీసుకొని .32 క్యాలిబర్‌ పిస్టల్‌ కొన్నారు. దాని కాలపరిమితి 2019తో ముగియడం, అదే ఏడాది ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో ఎన్నికలకు ముందే తన ఆయుధాన్ని రామగిరి పోలీసుస్టేషన్‌లో డిపాజిట్‌ చేశారు. అయితే బుధవారం తెల్లవారుజామున ఆయన బ్యాగేజ్‌లో లభించినవి 5.56 క్యాలిబర్‌ తూటాలు. ఇవి కేవలం సాయుధ బలగాలు మాత్రమే వాడే ఇన్సాస్‌ రైఫిల్స్‌కు సంబంధించినవని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో సిద్ధార్థ్‌ వద్ద 5.56 క్యాలిబర్‌కు చెందిన అక్రమ ఆయుధం ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఈ వ్యవహారంలో శంషాబాద్‌ పోలీసులు ఉదాసీనంగా వ్యవహరి స్తున్నట్లు కనిపిస్తోంది. సాధారణంగా నిషేధిత తుపాకీ తూటాలు కలిగి ఉన్న వ్యక్తులను పోలీసులు నిందితులను విడిచిపెట్టరు. అయితే సిద్ధార్థ్‌ను మాత్రం వివరణ కోరుతూ సీఆర్పీసీ 41–ఏ కింద నోటీసులు జారీ చేసి వదిలేయడం గమనార్హం.
ఆ కానిస్టేబుల్‌తో లింకులు ఉన్నాయా..?
సిద్ధార్థ్‌ వద్ద లభించిన తూటాకు, ఈ ఏడాది ఏప్రిల్‌లో అస్సాంలోని బాగ్‌డోగ్రా విమానా శ్రయంలో ఓ ఐటీబీపీ కానిస్టేబుల్‌ వద్ద లభిం చిన తూటాలకు లింకులున్నాయా? అనే అను మానాలు కలుగుతున్నాయి. అస్సాంలో పని చేసే అనంతపురం జిల్లా ములకనూరుకు చెందిన ఓ ఇండో–టిబెటన్‌ బోర్డర్‌ పోలీసు కానిస్టేబుల్‌ ఏప్రిల్‌ 17న బెంగళూరు వెళ్లేందుకు బాగ్‌డోగ్రా విమానాశ్రయానికి రాగా ఆయన బ్యాగేజ్‌లో 5.56 క్యాలిబర్‌కు చెందిన 100 పేల్చని తూటాలు లభ్యమయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయగా ఐటీబీపీ అధికారులు విచారణ చేస్తున్నారు. దీనికితోడు ఆ కానిస్టేబుల్‌కు పరిటాల కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.

About The Author