ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు సెప్టెంబర్‌లో …


ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు సెప్టెంబర్‌ రెండవ వారంలో నిర్వహించేం దుకు ఇంటర్మీడియెట్‌ బోర్డు సన్నాహాలు చేస్తోంది. అయితే పరీక్ష విద్యార్థుల ఐచ్ఛికమేనని అధికారులు తెలిపారు. మరో వారంలో పరీక్షల షెడ్యూల్డ్‌ విడుదల చేస్తామని బోర్డు వర్గాలు తెలిపాయి. గతేడాది పదో తరగతి ఉత్తీర్ణత సాధించి, ఇంటర్‌లో చేరిన వారు దాదాపు 4.70 లక్షల మంది ఉన్నారు. వాస్తవానికి ఈ ఏడాది మార్చిలో వీరికి మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించాలి. కరోనా కార ణంగా వీలు కాకపోవడంతో వారందరినీ ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్‌ చేశారు.అయితే, పరీక్షలు లేకపోతే భవిష్యత్‌లో సమస్యలు ఎదురవుతాయనే ఆందోళన కొందరు విద్యార్థుల నుంచి వ్యక్తమైంది. జాతీయ పోటీ పరీక్షలకు మార్కులే కొలమానంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పరీక్ష కోరుకునే వారికి కరోనా నియంత్రణలోకి వచ్చిన తర్వాత పరీక్షలు పెడతామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్‌ తీవ్రత తగ్గిందని ఇటీవలే వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక ఇచ్చింది. దీంతో పరీక్షలు పెట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

అయితే ద్వితీయ సంవత్సరం సిలబస్‌ చాలా వరకు పూర్తయిందని, ఈ సమయంలో మొదటి సంవత్సరం పరీక్షలకు వెళ్లడం కష్టమనే వాదన విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వినిపిస్తోంది. పరీక్షలు జరపాలంటే కనీసం 15 రోజుల ముందు షెడ్యూల్‌ ఇవ్వాలి. నిబంధనల ప్రకారం షెడ్యూల్‌ తర్వాత పరీక్షలకు నెల రోజుల గడువు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, పరీక్షలు ఇంకా ఆలస్యమైతే తమకు ఇబ్బందిగా ఉంటుందని విద్యార్థులు పేర్కొంటున్నారు.

About The Author