ప్రజా సమస్యల పరిష్కారానికే సచివాలయాలు కమిషనర్ గిరీషా
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి సచివాలయాలు వేదిక కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా అన్నారు.
చిత్తూరు జిల్లా:తిరుపతి,నగరంలోని ఐ. ఎస్. మహల్ సమీపంలోని 30, 31 వార్డులకు సంబంధించిన నాలుగు సచివాలయాలను గురువారం కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల నుండి ఎటువంటి సమస్యలు వస్తున్నాయి, ఎలా పరిష్కరిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలోని ఏ ఏ కార్యదర్శి ఎటువంటి విధులు నిర్వహిస్తున్నారని తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేసిన ఈ సచివాలయాలు సమస్యల పరిష్కారానికి చక్కటి వేదిక కావాలన్నారు. సమస్యలతో వచ్చే ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా మెలిగి వారి సమస్యలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. విధుల పట్ల బాధ్యతతో మెలాగాలన్నారు. ఆయా కార్యదర్శి వారి విధుల పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలన్నారు. హౌసింగ్, పెన్షన్స్, ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ, పారిశుద్ధ్య నిర్వహణ పట్ల కార్యదర్సులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కమిషనర్ వెంట కార్పొరేటర్లు కల్పన, రేవతి, సచివాలయ సిబ్బంది ఉన్నారు.