సోనూసూద్ ఇల్లు, కంపెనీల్లో ఐటీ సోదాలు
సినీ నటుడు సోనూసూద్ కు సంబంధించిన వాటిలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సోనూసూద్ నివాసాలు, ఆఫీసులు, కంపెనీల్లో తనిఖీలు జరుపుతున్నారు. ముంబైలోని ఆరు ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పాఠశాల విద్యార్థుల మెంటార్ షిప్ ప్రోగ్రాంకు ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సోనూసూద్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.
అంతకు ముందు పంజాబ్ ప్రభుత్వంలో కూడా కరోనా వైరస్ మీద అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్ నియమితులయ్యారు. ఈ రెండు ప్రభుత్వాలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవే. ఇలాంటి సమయంలో సోనూ సూద్‌కు సంబంధించిన ప్రాంతాల్లో ఐటీ అధికారులు ‘సర్వే’ చేశారనే వార్త సంచలనంగా మారింది.
లాక్ డౌన్‌లో వలస కార్మికుల పాలిట ఆపద్భాందవుడిలా సోనూసూద్ నిలిచాడు. వారిని సొంత గ్రామాలకు చేర్చాడు. ప్రభుత్వాలు కూడా చేయని పని సోనూ చేశాడు. వందల బస్సులు ఏర్పాటు చేసి కూలీలను వారి ఇళ్లకు చేర్చాడు. దీంతో దేశం మొత్తం సోనూని రియల్ హీరోగా కొనియాడింది. ఆపదలో ఉన్న ఎంతోమందికి సాయం చేశాడు. కరోనా బాధితులకు ఖరీదైన మందులు ఉచితంగా సమకూర్చాడు. ఆక్సిజన్ సిలిండర్లు అందించాడు. ఆక్సిజన్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేశాడు. ఇలా ఎంతో చేశాడు. గొప్ప మానవతావాదిగా గుర్తింపు పొందాడు. సాయం పొందిన వాళ్లు సోనూని దేవుడిలా చూస్తున్నారు.