MAA Elections 2021 Updates: కొనసాగుతున్న ‘మా’పోలింగ్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
గత ఆరువారాల నుంచి హోరాహోరీగా ప్రచారాలు, విమర్శలు, ప్రతి విమర్శలు వాడీవేడిగా కొనసాగాయి. హీరో మంచు విష్ణు, నటుడు ప్రకాశ్ రాజ్ ప్యానెళ్లు పోటీ పడుతున్నాయి. మా ఎన్నికలో ఓటు వేసే సభ్యులు తప్పని సరిగా గుర్తింపు కార్డు తీసుకురావాలని ఎన్నికల అధికారులు సూచించారు. జూబ్లీహిల్స్ స్కూల్ ప్రధాన గేటు వద్ద పోలీసులు, ఆయా ప్యానెళ్ల ఏజెంట్లు గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే కేంద్రంలోకి అనుమతిస్తారు. కేంద్రంలోకి వెళ్లిన తర్వాత జాబితాలో మరోసారి సభ్యుల పేర్లను తనిఖీ చేస్తారు. అక్కడ ఓటర్ స్లిప్ తీసుకున్న తర్వాతనే ఓటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2వరకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు ప్లటూన్ల బలగాలు ఎన్నికల కేంద్రం వద్ద మోహరించారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో జరగనున్న ఎన్నికల కోసం మూడు గదులను కేటాయించి ఒక్కో గదిలో నాలుగు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పద్ధతిలో జరగనున్న ఈ ఎన్నికల్లో 883 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న చిరంజీవి
‘మా’ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం సినీ పెద్దలు క్యూ కడుతున్నారు. ‘మా’ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ ఓటు హక్కును వినియోగించున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విన్నర్లు ఎవరనేది ఓటర్లే నిర్ణయిస్తారని చెప్పారు. మెగా ఫ్యామిలీ అంతా ప్రకాశ్ రాజ్‌కే మద్దతు ఇస్తున్నారు కదా విలేకర్లు ప్రశ్నించగా, అలాంటిదేమి లేదని చిరంజీవి అన్నారు. ఓటర్లు ఎవరిని గెలిపిస్తే వారికే తన మద్దతు ఉంటుందన్నారు.
వ్యక్తిగత దూషణలు అవసరమా?: పవన్
‘మా’పోలింగ్ ప్రారంభమైంది. పొసాని కృష్ణ మురళి, పవన్ కల్యాణ్ వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. గతంలో ఇంతపోటీ నేను చూడలేదు. తిప్పికొడితే 900 ఓట్లు ఉండవు. దీనికోసం వ్యక్తిగత దూషణలు అవసరమా’ అని ప్రశ్నించారు. సినిమాలు చేసే వాళ్లు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి కానీ.. ఇలాంటి వ్యక్తిగత దూషణలు ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయన్నారు. ఇక మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి అన్న ప్రచారం జరుగుతుందన్నదానిపై పవన్ స్పందిస్తూ.. ‘వారిద్దరు మంచి ఫ్రెండ్స్’ అని తెలిపారు.
మంచు విష్ణును ఆలింగనం చేసుకున్న ప్రకాశ్‌రాజ్
మా ఎన్నికలు జరుగుతోన్న జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌కు సినీ తారలు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. అధ్యక్ష పదవిలో ఉన్న మంచు విష్ణు ఉదయాన్నే చేరుకోగా. కాసేపటి క్రితమే ప్రకాశ్ రాజ్ కూడా వచ్చారు. వచ్చి రాగానే మంచు విష్ణును ఆలింగనం చేసుకున్నారు. ఇక అక్కడే ఉన్న మోహన్ బాబును చూడగానే కాళ్లకు నమస్కరించేందుకు ప్రయత్నించాడు అయితే మోహన్ బాబు దానికి నిరాకరించి ప్రకాశ్ రాజ్‌ను భుజం తట్టాడు. ఈ సన్నివేశం ఆసక్తిని రేకెత్తించింది.
మా ప్యానల్‌దే గెలుపు : మంచు విష్ణు
‘మా’ ఎన్నికల్లో మా ప్యానల్‌దే గెలుపు అన్నారు మంచు విష్ణు. సినీ పెద్దల ఆశీర్వాదాలు తమకే ఉన్నాయన్నాని చెప్పారు. ప్రకాశ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ఆయన పెద్దరికాన్ని గౌరవించి తానేమి అనలేదని, తన విజ్ఞతకే వాటిని వదిలేస్తున్నానని చెప్పారు.
నేను కూడా పోటీ చేయాలనున్నా: సాయి కుమార్
మా అధ్యక్ష పదవి కోసం కొనసాగుతోన్న ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు సాయి కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ఎన్నికల స్థాయిలో మా ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. తాను కూడా పోటీ చేయాలనుకున్నానని, కానీ షూటింగ్‌లో బిజీ ఉండడంతో పోటీలో లేనని చెప్పుకొచ్చాడు.తాను లోకల్, నాన్ లోకల్ కాదని నేషనలిస్ట్ అని తెలిపాడు.
ఓటు హక్కు వినియోగించుకున్న రామ్ చరణ్
మా అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్. ఆయనతో పాటు మంచు లక్ష్మీ, శ్రీకాంత్, సుమ, సుడిగాలి సుధీర్, ఉత్తేజ్, సాయి వెంకట్, వేణు, ఈటీవీ ప్రభాకర్, మురళీమోహన్ తదితరులు తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తనికెళ్ల తనికెళ్ళ భరణి, రఘుబాబు, ఆకాశ్ పూరి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
‘మా’ పోలింగ్ వద్ద ఉద్రిక్తత
‘మా’పోలింగ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రకాశ్‌రాజ్ ఫ్యానల్ మెంబర్స్‌పై మంచు విష్ణు ప్యానల్ మెంబర్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం లోపల ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. నమూనా బ్యాలెట్ ఇస్తున్న శివారెడ్డిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువురిని అక్కడ నుంచి పంపించేశారు.