ఆర్టీసీ బస్సు ను కంటైనర్ను ఢీకొని పిచ్చాటూరు డ్రైవర్ ఏసీ బాబు మృతి..


చిత్తూరు జిల్లా సత్యవేడు ఆర్టిసి డిపోకు చెందిన హైదరాబాద్ బస్సు కంటైనర్ను ఢీ కొనడంతో ఆర్టీసీ డ్రైవర్ ఏసీ బాబు(49) మృతి చెందారు. మరో డ్రైవర్ మహేశ్వర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాద సంఘటన గురువారం తెల్లవారుజామున జడ్చర్ల వద్ద సంభవించింది. వివరాలిలా సత్యవేడు డిపోకు చెందిన ఆర్టిసి బస్సు బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో సత్యవేడు నుంచి హైదరాబాదుకు బయలుదేరి వెళ్ళింది. డ్రైవర్గా బాబు, మహేశ్వర్ ఇద్దరూ డ్యూటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మార్గమధ్యంలో జడ్చర్ల వద్ద గురువారం తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో ముందు వెళ్తున్న కంటైనర్ను అధిగమించే టప్పుడు బస్సు అదుపుతప్పి కంటైనర్ను ఢీ కొట్టింది. దీంతో బస్సు నడుపుతున్న ఏసి బాబు అక్కడికక్కడే మృతి చెందగా, మరో డ్రైవర్ మహేశ్వర కు తలకు తీవ్రగాయాలు అయినట్టు స్థానిక ఆర్టీసీ కార్మికులు పలువురు తెలిపారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ మహేశ్వర్ ను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. కంటైనర్ను ఢీ కొనడంతో ఆర్టిసి బస్సు ముందుభాగం నుజ్జు నుజ్జు అయింది. ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ ఏసీ బాబు స్వగ్రామం పిచ్చాటూరు మండలం నీరువాయి గ్రామంలో గుర్తించడం జరిగింది.దీనిపై అక్కడి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రమాదం సమాచారాన్ని సత్యవేడు ఆర్టిసి డిపో మేనేజర్ గంగాధర్ రావుకు అందించారు.