సుప్రీంకోర్టు ప్రధాన నాయమూర్తి ఎంవి రమణ ‘సా’ కు టీటీడీ కాంట్రాక్ట్ కార్మికుల ఆకిలి కేక…


సుప్రీంకోర్టు ప్రధాన నాయమూర్తి ఎంవి రమణ ‘సా’ కు టీటీడీ కాంట్రాక్ట్ కార్మికుల ఆకిలి కేక… (ఇది మా లేఖ)

సుప్రీంకోర్టు పెదాన నాయమూర్తి పోస్టులో తిరుపతికి వస్తాండా! రంట గదా ‘సా’… మీకు సోగతం ‘సా’… మా గురించి కూడా నీకు సెబ్దామని ఈ కాగితం రాస్తా ఉండాము… ‘సా’ మా ఇంటి కాడ ఇండ్లు, వాకిలి, పిల్లాజెల్లా, అమ్మ నాయినా, అత్తా మామను… గొడ్డూ గోదను వదిలేసి… సామి కాడ పనిజేద్దామని పదేండ్ల కింద వచ్చేస్తిమి ‘సా’… జీతం ఐదు వేల దాకా ఇస్తా ఉండ్రి. మల్లా రెండేండ్లకు 6,700 పెంచిరి. 8 ఏండ్లుగా ఇదే జీతం ‘సా’ … చానా కష్టంగా ఉంది ‘సా’ పిల్కాయలుపెద్ద యిరి. పెద్దయినాక అన్నం ఎక్కువ తింటారు గదా ‘సా’ వచ్చే దుడ్డు మాత్రం పెరగకపాయె ‘సా’… పదేండ్ల కింద బియ్యం, కూరగాయ, నూనె, పప్పు రేటు అగ్గవగా ఉండే. రూపాయో, పావలో మిగల్తా ఉండే.. ఇప్పుడు ధర పెరిగింది గద ‘సా’ … ధర పెరిగినంత జీతం పెరగకపాయె గద ‘సా’. చానా కష్టంగా ఉండాదని టిటిడి సార్లకు చానా సార్లు సెప్పినాము ‘సా’… ఎవురికీ పట్టక పాయే ‘సా’ ఈ కాంట్రాక్టోళ్లు… పదిమంది జేసే పని ఇద్దురే జెయ్యండని పాణం దీస్తా ఉండారు… ‘సా’ ఎంత పని జేసినా పది మంది పెని ఇద్దురు జేస్తే శుభ్రం యాడ్నుంచి వస్తాది ‘సా’ … టిటిడి సార్లు కాంట్రాక్టోళ్లకు ‘ఫైన్’ లు ఏసినారని ఇంగా ఎక్కువ పనిజెయ్యాలని సంపేస్తారు ‘సా’ తెల్లారుజామున 2 గంటలకు నిద్రలేస్తామా? నిద్రపోయే బిడ్డలకు జడ ఏసి… అప్పుడు మొగుడికి… ఇంట్లో ముసిలోళ్లకి, పిల్లగాండ్లకు గబ…గబా వంటొండేసి…గంత క్యారియర్ గట్టుకోని … సామి దగ్గర పనని … ఒళ్లుకు బోసుకోని … పరిగెత్తుకుంటా బోయి బస్సు ఎక్కి కొండమీదకు బోతే… ఐదు నిమిషాలు లేటయినావు డూటీ లేదు ‘బో’… అని కాంట్రాక్టోడు అన్నెప్పుడు దెలుస్తాది ‘సా’ మాకు… కడుపు మంట అంటే ఎట్టాడిదో… ‘గెస్టవుస్’లో ఎవుడయినా యాత్రికుడు… బంగారమో … సెల్ ఫోనో పారేసుకుంటే… మాకు ఉంటాది ‘సా’ గెస్టవుస్ లో ఉండే మమ్మల్ని (కార్మికులు) పోలీస్ స్టేషన్ కాడ నిలబెట్టేస్తారు ‘సా’ ఇంటికాడ బిడ్డలు, ఒళ్లు బాగాలేని ముసిలోళ్లు గుర్తొస్తా ఉంటారు ‘సా’… ఈడేమో పోలీసు ‘సా’ రాలేదు… బయట నిల్సోండి వాయ్… నీకే గద ‘మేయ్’ చెప్పేది అని దబాయింపు లు … చేయని దొంగతనానికి ‘దొంగలుగా’ నిల్సుకోవాల్సొస్తుంది ‘సా’… ఒగసారి ఓ కూలోనికి అభిమానం అడ్డం వచ్చి దొంగనైపోతినే అని బాధ… పోలీసోళ్ల భయంతో గెస్టవుస్ పైనుంచి… ఈ మద్దినే దూకి సచ్చిపోయినాడు గద ‘సా’… పోలీసోళ్లకి కంప్లెంట్ ఇచ్చినాయన పళ్లికిలించుకుంటూ వచ్చి వేరేసోట మర్సిపోయినా… దొరికింది ‘సా’… అని సెప్పినప్పుడు ఉంటాది ‘సా’ మమ్మల్ని కని పారేసిన అమ్మా, నాయిన మీద కోపం మూరడెత్తు వస్సుంది. ‘సా’ ఆడికి రెండు రోజులుగా పోలీసోళ్ల కాడ్నే మా బతుకు తెల్లారింటాది ‘సా’. అయినా ‘సా’ సామి దగ్గరికి ఎందుకు వస్తారు ‘సా’ పెద్దోళ్ళు పెద్ద కష్టం.. చిన్నోళ్లు చిన్న కష్టం సెప్పుకునే దానికే గదా! సామి దగ్గర మా కష్టం ఎవరికి సెప్పుకోవాలి ‘సా’ వై వి సుబ్బారెడ్డి సారు చేర్ మన్ అయినాక యాడెడ్నుంచో మాలా, మాదిగ, ఎరికిలోళ్లు, యానదోళ్లకు బస్సులు పెట్టి.. ఖర్సుపెట్టి దెర్శనాలు సెయిపిస్తా ఉండాడు ‘సా’ సామి దగ్గరే పదేండ్లుగా పన్జేస్తా ఉండాము గదా! సమ్మత్సరానికి ఒగసారి గూడా మాకు దెర్శనం ఎందుకు ఇప్పీడు ‘సా’ ఈ సుబ్బారెడ్డి ‘సారు’ … జవహర్ సార్ కు సెప్పుకుందామని చానాసూర్లు ట్రయ్ చేసినాము ‘సా’ ఆ యాఫీసులోకి మమ్మల్నిరానీరు ‘సా’. ఎలచ్చన్ల ముందు జగన్మోహన్రెడ్డి సారు… మనమొస్తానే మీకు కాంట్రాక్టర్ని లేకుండా జేస్తాము. టిటిడి నేరుగా జీతాలు ఇస్తాది అని జెప్పినాడు ‘సా’. మూడు నెలల్లో ఇస్తామని జెప్పాడు మూడు ఏండ్లు అయిపోతాంది ‘సా’ జరగలేదు ‘సా’ … ఈ మద్దినే మాకు సహాయం సేయమని ఎర్ర జెండా సిఐటియు అన్నోళ్లని, అక్కోళ్లని అడిగినాము ‘సా’ నవంబరు ఇరవయ్యేడో తేదీ నుంచి డిసెంబర్ పది దాకా టీటీడీ ఆఫీస్ ముందు మా బాధలు తీర్చమని పడున్నాము. ఎంగటేశ్వరస్వామి పోటో బెట్టుకొని పూజలు సేసుకుంటా 14 రోజులు రోడ్లమీద ఉండి పూడ్సినాం… ‘సా’ ఏమాటకామాటే సెప్పాలి ‘సా’ తుపాను, వాన, చలి, ఎండ, బురదలో మాతో బాటే ఆ అన్నోళ్లు, అక్కోళ్లు అంతంత సదువులు… సదువుకోని దొల్లాడినారు ‘సా’ ఆచ్చర్యంగా ఉంది ‘సా’ సంఘమోళ్లు ఎలా ఉన్నారని? సార్ మా కష్టాన్ని చూడాల్సిన సార్లు, మేడమమ్మ సంగమోళ్లతో మేము మాట్లాడేది లేదు. డ్యూటీలకు పోక పోతే తీసి పారేస్తామని బెదిరించినారు ‘సా’ తీస్తే… తీసినారు లే… అని మేమంతా బిత్తరపోకండా రోడ్డు లో సామి భజనలు చేసుకుంటా ఉండిపోయినాము. ఈ లోపల మన సీఎం సారు తిరుపతి కి వరదల్ని చూసేదానికి వచ్చినాడు ‘సా’. ఇదేరా సందనుకుని మా మురళి అన్న, సుబ్రహ్మణ్యం అన్న ముఖ్యమంత్రిని కలపమని మా ఎదురుగానే అందర్నీ అడిగేసినారు ‘సా’ ఒక్కరు కూడా సగాయం చేయలేక పోయినారు ‘సా’. మా బిల్లిబిత్తిరి రాధ, ఇంగొంత మంది మావోళ్ళు మన ముక్కెమంత్రి జగన్ సార్ని వరదళోళ్లు మాదిరిగా పోయి కలిసినారు ‘సా’. సారు..‌ మీకు టయిము స్కేలు ఇవ్వలేదా? ఇచ్చేస్తాం…బో… అని నెత్తి మీద ఒట్టేసి చెప్పినాడు ‘సా’ … 24 గంటల్లో అయిపోతుంది అన్నేడు ‘సా’ ఆ దేవుడు సత్తెంగా మేము నిజమే ‘సా’… సెబ్తున్నది‌. 24 గంటలు 48 గంటలు… రోజులు అయిపోయినాయి ‘సా’ ఎవురూ పట్టించుకోలేదు… ‘సా’ ఏం చేయాలి… 15 రోజుల తర్వాత జవహర్ సారుకు కోపమొచ్చిందంట… ‘సా’ మా సంఘం నాయకుల ఇండ్ల దగ్గర పోలీసుల్ని పెట్టి బయటికి రానీక పాయిరి. మమ్మల్ని దొరికినోళ్లని దొరికినట్టు రామచంద్రపురం, చంద్రగిరి పోలీస్ స్టేషన్ లకు పంపించిరి. ఆరోజు చూడాలి ‘సా’ ఎంత మంది పోలీసోళ్లో… మా టీటీడీ ఆఫీసంతా పోలీసోళ్లే… పోలీసోళ్లు ‘సా’. మా జీవితంలో అంతమందిని చూళ్లే… కొట్టి, తిట్టి మమ్మల్ని అక్కడినుంచి తరింపారేసిరి. మావోళ్లు 107 మంది మీద కేసులు బెట్టిరి. 120 బి సెక్సన్ కుట్ర కేసు గదంట ‘సా’. మేము ఏం కుట్ర జేస్తాం ‘సా’ 14 రోజులకు 14 కేసులు పెట్టేసినారు ‘సా’ మా బాదల్ని మాన్చమంటే జైలుకు పంపితే నాయమా? ‘సా’ మీరు దేశానికే పెద్ద సారంట గద ‘సా’… మా కోసం ఒగసారి పాటు పడండి ‘సా’. సామి కోసం కష్టపడే మాకు సామి రూపంలో సగాయం చేస్తారని ఈ కాగితం నీకు బంపుతున్నాము ‘సా’ మాకు నాయం జేయండి ‘సా’…

ఇట్లు

*తిరుమల సామి దగ్గర పనిచేసే కార్మికులు*
*రచన: కందారపు మురళి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి, తిరుపతి.