టీమిండియాకు ఏమైంద‌స‌లు…!


మొన్న‌టి వ‌ర‌కూ టీమిండియాకు సంబంధించి ద్వితీయ శ్రేణి జ‌ట్టు కూడా, ఇత‌ర దేశాల అంత‌ర్జాతీయ స్థాయి క్రికెట్ జ‌ట్ల‌ను క‌ల‌వ‌ర‌పెడుతుంద‌ని అనుకుంటే, ద‌క్షిణాఫ్రికా టూర్లో మాత్రం టీమిండియా అత్యంత పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌ను కొన‌సాగిస్తూ ఉంది. ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న వ‌ర‌కూ బాగానే ఆడిన జ‌ట్టు, టీ20 ప్ర‌పంచ‌క‌ప్ లో కూడా ఆశించిన స్థాయి ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇవ్వ‌లేదు. ఆ త‌ర్వాత టీమిండియాకు సంబంధించి సెల‌క్ష‌న్ ప్ర‌క్రియ‌లో బోలెడ‌న్ని మార్పుచేర్పులు జ‌రిగాయి. ఇలా జ‌రిగిన ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో టెస్టు సీరిస్ ను కోల్పోవ‌డంతో పాటు, వ‌న్డే సీరిస్ ను కూడా చేజార్చుకుంది టీమిండియా.

క్రితం సారి సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ప్పుడు తొలుత టెస్టుల్లో వ‌ర‌స ఓట‌ముల‌ను మూట‌గ‌ట్టుకుంది. చివ‌రి టెస్టులో విజ‌యం సాధించి, అదే ఊపుతో వ‌న్డే సీరిస్ ను గెలుచుకుని వ‌చ్చి ప‌రువు నిలుపుకుంది టీమిండియా. అయితే ఈ సారి మాత్రం వ‌న్డే సీరిస్ కూడా ద‌క్క‌లేదు.

వాస్త‌వానికి గ‌తంతో పోలిస్తే ఇప్పుడు ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు బ‌ల‌హీనంగా క‌నిపిస్తోంది. పేరున్న స్టార్ క్రికెట‌ర్లు జ‌ట్టుకు దూరం అయ్యారు. ఇంత‌కు ముందు ఇండియా జ‌ట్టు సౌతాఫ్రికా వెళ్లిన‌ప్పుడు డివిలియ‌ర్స్, ఆమ్లా, డేల్ స్టెయిన్, మోర్కెల్ వంటి పేరున్న క్రికెటర్లు జ‌ట్టులో ఉండేవారు. వీరికి తోడు మ‌రి కొంత‌మంది యంగ్ ప్లేయ‌ర్స్ కూడా స‌త్తా చూపించే వారు ఉండేవారు.

ప్ర‌స్తుత సౌతాఫ్రికా టీమ్ లో బ‌లంగా క‌నిపిస్తోంది బౌలింగ్ లైన‌ప్పే. బ్యాటింగ్ లో గ‌త ప‌ర్య‌ట‌న ఆట‌గాళ్ల‌తో పోలిస్తే ప్ర‌స్తుత ప్లేయ‌ర్లు అనామ‌కుల కిందే లెక్క‌! మ‌రి అలాంటి జ‌ట్టు టీమిండియాను ఊపి నీళ్లు తాపుతోంది. చివ‌రి వ‌న్డే మాత్ర‌మే మిగిలిన నేప‌థ్యంలో క‌నీసం ఆ మ్యాచ్ లో అయినా విజ‌యం సాధించి భార‌త ఆట‌గాళ్లు ఊర‌ట‌ను పొందుతారో లేద వైట్ వాష్ అవుతారో!

ఇక టీమిండియా ఆట‌గాళ్ల ప్ర‌ద‌ర్శ‌న విష‌యానికి వ‌స్తే హాఫ్ సెంచ‌రీ కొట్టేస్తే చాలా రిలీఫ్ గా క‌నిపిస్తూ ఉన్నారు. ఎలాగోలా యాభై ప‌రుగులు చేస్తే గొప్ప‌గా ఆడేసిన‌ట్టుగా, మ‌రుస‌టి మ్యాచ్ లో స్థానం ఖ‌రారు అయిన‌ట్టుగా క‌నిపిస్తున్నాయి టీమిండియా వ్య‌వ‌హారాలు. ప్ర‌ధాన ఆట‌గాళ్లు, పేరున్న ఆట‌గాళ్లు.. అంద‌రిదీ ఇదే క‌థ‌. మ‌రి ఇలా అయితే విజ‌యాలు ఎలా ద‌క్కుతాయ‌బ్బా!

About The Author