బంతి ఉద్యోగుల కోర్టులోనే!


ఉద్యోగుల డిమాండ్ల‌పై సీఎం జ‌గ‌న్ త‌న ఉద్దేశాన్ని స్ప‌ష్టం చేశారు. ఇక తేల్చుకోవాల్సింది ఉద్యోగులేనా? అంటే …ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. ఇప్ప‌టికే ఉద్యోగులు ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఉద్యోగుల బెదిరింపులు, హెచ్చ‌రిక‌ల‌ను ప్ర‌భుత్వం పెద్ద‌గా ప‌ట్టించుకుంటున్న‌ట్టుగా క‌నిపించ‌డం లేదు. అలాగ‌ని వాళ్ల ఉద్య‌మానికి అడ్డుత‌గాల‌నే సంకుచిత ధోర‌ణిలో కూడా ప్ర‌భుత్వం లేదు. ఉద్య‌మాలు చేసుకోవ‌డం వారి హ‌క్కుగా సీఎం జ‌గ‌న్ త‌న స‌హ‌చ‌ర మంత్రుల‌తో అన్న‌ట్టుగా వార్త‌లొస్తున్నాయి.

కేబినెట్ భేటీలో ఉద్యోగుల డిమాండ్ల‌పై సీఎం జ‌గ‌న్ మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టారు. మంత్రుల‌తో ఆయ‌న ఏమ‌న్నారంటే…

“రాష్ట్ర ఆదాయం ప‌డిపోయింది. కేంద్రం నుంచి ప‌న్నుల వాటా త‌గ్గింది. ఆదాయం పెరిగితేనే అప్పు ప‌రిమితి పెరుగుతుంది. ఈ ఇబ్బందులే లేక‌పోతే ఉద్యోగుల‌కు చేయ‌గ‌లిగినంతా చేస్తాం క‌దా? . వారితో మ‌న‌ది ఫ్రెండ్లీ ప్ర‌భుత్వం. ఉద్యోగుల డిమాండ్లు తీర్చాలంటే ఏదో ఒక ప‌థ‌కాన్ని ఆపాల్సి వ‌స్తుంది” అని సీఎం స్ప‌ష్టం చేశారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్ర‌భుత్వంలో విలీనం, ఆశా వ‌ర్క‌ర్లు, అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌లు, పారిశుధ్య కార్మికులు, వీఏవో, యానిమేట‌ర్ల‌కు జీతాలు పెంచిన విష‌యాన్ని జ‌గ‌న్ గుర్తు చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

రాష్ట్ర ఆదాయం ప‌డిపోవ‌డం వ‌ల్లే ఉద్యోగుల డిమాండ్ల‌ను తీర్చ‌లేకున్నామ‌నే సందేశాన్ని సీఎం పంపారు. ఒక‌వేళ ఉద్యోగుల డిమాండ్ల‌ను నెర‌వేర్చాలంటే ఏదో ఒక భారీ సంక్షేమ ప‌థ‌కాన్ని నిలుపుద‌ల చేయాల్సి వుంటుంద‌ని జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా తెర‌పైకి తెచ్చారు. ఇప్ప‌టికే ఉద్యోగుల‌పై ప్ర‌జ‌ల్లో స‌ద‌భిప్రాయం లేదు. ఇక వాళ్ల డిమాండ్ల‌ను నెర‌వేర్చేందుకు సంక్షేమ ప‌థ‌కాన్ని ఆపాల్సి వ‌స్తుంద‌నే సంకేతాల్ని తీసుకెళ్ల‌డం ద్వారా… మ‌రింత‌గా ఉద్యోగుల‌పై వ్య‌తిరేక‌త పెరిగే ప్ర‌మాదం లేక‌పోలేదు.

ఉద్యోగులు ఉద్య‌మ‌బాట ప‌డుతున్న‌ప్ప‌టికీ, డిమాండ్లు మాత్రం నెర‌వేర్చే ప్ర‌శ్నే ఉత్ప‌న్నం కాద‌ని సీఎం నేరుగానే చెప్పారు. ఉద్యోగుల‌కు తాను చేసిన మంచి ఏంటో కూడా ఆయ‌న ప్ర‌స్తావించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇంత‌కు మించి చేయ‌డానికి రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దోహ‌దం చేయ‌డం లేద‌ని, ఈ విష‌యాన్ని ఉద్యోగులు అర్థం చేసుకోవాల‌ని ఆయ‌న కోరారు. సీఎం మాట మ‌న్నించి పెరిగిందే చాల‌ని సంతృప్తి చెందుతారా? లేక ర‌చ్చ‌కు దిగుతారా? అనేది ఉద్యోగుల చేతుల్లోనే ఉంది.

About The Author