అన్నమయ్య జిల్లాకు మంగళం.. ?


*మదనపల్లి, పీలేరు, తంబళ్లపల్లి నియోజక వర్గాలు చిత్తూరు జిల్లాలోకి*..

*కోడూరు అసెంబ్లీ నియోజకవర్గం తిరుపతి జిల్లాలోకి*..

*పాత కడప జిల్లా పునరుద్దరణ*

*ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి గ్రీన్‌సిగల్‌*..

పద కవితా పితామహుడు అన్నమయ్య పేరు మీద ఏర్పాటైన అన్నమయ్య జిల్లా వైభవం మూడునాళ్ళ ముచ్చట కానుంది. జిల్లా ఏర్పాటై ఏడాది కూడా కాకముందే కాలగర్భంలో కలిసిపోనుంది. మదనపల్లి వాసుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా రూపుదిద్దుకున్న అన్నమయ్య జిల్లా తొందరలోనే అంతర్ధానం కానుంది. అన్నమయ్య జిల్లాను రద్దు చేసి పాత కడప జిల్లాను పునరుద్దరించాలని అధికార పార్టీ నేతలు కోరుతున్నారు. కడప జిల్లాను అలానే ఉంచి, మదనపల్లి, పీలేరు, తంబళ్లపల్లి నియోజక వర్గాలను చిత్తూరు జిల్లాలో కలపాలని భావిస్తున్నట్లు తెలిసింది. కోడూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలిపే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని పైన కేబినెట్ లో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

దక్షిణ భారతదేశంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు, గొప్ప వైష్ణవ భక్తుడు అన్నమయ్య. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని, అహోబిలములోని నరసింహ స్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32 వేలకు పైగా కీర్తనలు రచించారు. అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి. కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు. శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించారని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉంది. ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా కొందరి అభిప్రాయం. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. కడప జిల్లా రాజంపేట తాలూకా పొత్తిపినాడు మండలం నడిబొడ్డున తాళ్లపాక గ్రామంలో అన్నమయ్య జన్మించారు. ఆ గ్రామంలో వెలసిన చెన్నకేశవస్వామి, సిద్ధేశ్వరస్వామిల కరుణాకటాక్షములతో ఆ గ్రామజనులు జీవనం సాగించేవారు. ఈ చెన్నకేశవస్వామిని దేవతలు, ఋషులు, సిద్ధులు ప్రతి రోజూ పూజిస్తారు. ఈ చెన్నకేశవస్వామి గుడిని ఆశ్రయించుకొని కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు జీవించేవి. వారిలో నారాయణయ్య, విఠలయ్యలు విష్ణుభక్తిరతులై తాళ్ళపాక చెన్న కేశవస్వామిని సేవించుకొంటూ జీవితం గడిపేవారు. వీరి కుమారుడే అన్నమయ్య. కావున రాజంపేట నియోజకవర్గానికి రాయచోటిని జిల్లా కేంద్రంగా నిర్ణయించారు. దానికి అన్నమయ్య జిల్లా అని నామకరణం చేశారు.

జిల్లాల ఏర్పాటు తరువాత వచ్చిన అభ్యర్దలు..డిమాండ్ల పైన అధ్యయనం జరిగింది. ఇందులో భాగంగా కొన్ని మార్పులు తెర మీదకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఏపీలో మరోసారి జిల్లాల పునర్విభజన పై ప్రభుత్వం మళ్ళీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో పోలవరం కొనసాగుతోంది. పోలవరం నిర్వాసితులకు ప్రత్యేక జిల్లా ఉండాలనే ఉద్దేశ్యంతో కొత్త జిల్లా ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్విభజన పైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.

అలాగే అనంతపురం జిల్లాను తిరిగి పూర్వస్థాయికి తీసుకువస్తారని చెపుతున్నారు. గిరిజన ప్రాంతాలతో ఏర్పాటైన పార్వతిపురం మన్యం జిల్లా ఏర్పాటు నుండి కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గనున్నట్లు సమాచారం. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన ప్రాంతాలతో ఈ జిల్లాను ఏర్పాటు చేసారు. అయితే, చిన్న జిల్లా కావడం, పాలనాపరంగా అసౌకర్యంగా ఉండటం వంటి కారణాలతో పార్వతిపురం మన్యం జిల్లాను రద్దు చేసి, ఆ స్థానంలో పోలవరం కేంద్రంగా కొత్తగా మరో గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదనకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటి వరకు పోలవరం ప్రాంతం ఏలూరు జిల్లా పరిధిలో ఉండగా, మరో గిరిజన ప్రాంతమైన రంపచోడవరం నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది.

మంత్రివర్గంలో నిర్ణయం:ఆయా ప్రాంత గిరిజనులు ప్రస్తుతం జిల్లా కేంద్రమైన పాడేరుకు కార్యాలయ పనుల కోసం రావాలంటే కనీసం 200 కిలో మీటర్లకు పైగా ప్రయాణించాల్సి రావడం కష్టమవుతోంది. దీనిపై పలు విజ్ఞప్తులు అందడంతో నూతన జిల్లా ఏర్పాటు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీనితో పాటు పోలవరం ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులవుతున్న వారికి పునరావాస పనులకు పరిపాలన సౌలభ్యం సులభమవుతుందని భావిస్తున్నట్లు తెలిసింది. మన్యం జిల్లాను రద్దు చేసినా పోలవరం జిల్లా ఏర్పాటు ద్వారా గిరిజన జిల్లాల సంఖ్యలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. అయితే, ఈ మొత్తం ప్రతిపాదనల పైన మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సమాచారం మేరకు

About The Author