జర్నలిస్ట్ చంద్ర కు కన్నీటి వీడ్కోలు పలికిన పాత్రికేయులు…


కరోనా మహమ్మారి సోకి నియోజకవర్గంలో ఇద్దరు పాత్రికేయులు మరణించారు అనే విషయాన్ని మరచిపోక ముందే అవనిగడ్డ నియోజకవర్గంలో సిటీ కేబుల్ రిపోర్టర్ గా సుదీర్ఘ కాలం పనిచేసిన కళ్ళేపల్లి చంద్ర బలవన్మరణ వార్త తోటి పాత్రికేయుల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వయసులో పెద్దవాడైనా అందరినీ చిరునవ్వుతో అన్నా అన్నా అంటూ పిలిచే సీనియర్ జర్నలిస్ట్ కళ్ళేపల్లి చంద్ర ఇక లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేక పలువురు కన్నీటిపర్యంతమయ్యారు. ఆయన మరణ వార్త విన్న వెంటనే ఆ కుటుంబానికి అన్ని తామై నిలిచారు తోటి పాత్రికేయులు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.

” *నా బిడ్డ చదువుకోవడానికి హాస్టల్ ఫీజు కూడా కట్టుకోలేని దుస్థితిలో ఉన్నాను, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను* ” అంటూ చంద్ర రాసిన చివరి మాటలు జర్నలిస్టుల స్థితిగతులను గుర్తుచేసాయి. పుట్టినప్పుడు ఏమీ తీసుకుని రాలేదు, పోయినప్పుడు ఏమి తీసుకుని పోలేదు అనే మాటలు జర్నలిస్ట్ చంద్ర విషయంలో తప్పు అనేలా చేసాయి. తాను పుట్టినప్పుడు ఏమి తెచ్చాడో తెలియదు కానీ పోయినప్పుడు మాత్రం ఎంతోమంది ప్రేమాభిమానాన్ని తీసుకుని వెళ్లిపోయాడు ఈరోజు.

ఈరోజు ఉదయం చంద్ర బలవన్మరణ విషయం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలం నుండి మృతదేహాన్ని అవనిగడ్డ హాస్పిటల్ కి పంపడం, హాస్పిటల్ దగ్గర వారికి చేదోడుగా నిలవడం, ఆయన భౌతికకాయం మరలా ఇంటికి చేరేసరికి అన్ని ఏర్పాట్లు చేయడం వరకు అవనిగడ్డ నియోజకవర్గ పాత్రికేయులు అన్నింటా తామై నిలిచారు. చివరి మజిలీ వరకు అన్నింటా తోడై నిలిచారు.

About The Author