చదువును, ఉద్యోగాలను మాతృభాషతో అనుసంధానం చేయాలి


చదువును, ఉద్యోగాలను మాతృభాషతో అనుసంధానం చేయాలి
* భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి పిలుపు
* విశిష్ట తెలుగు దిగ్దర్శనం పుస్తకావిష్కరణ
* ఆచార్య తూమాటి దొణప్ప గారి శతజయంతి ఏడాది సందర్భంగా నివాళులు
* ప్రాచీన తెలుగు హోదా ఫలాలు భవిష్యత్ తరాలకు అందేందుకు తెలుగు వారంతా కృషి చేయాలి
* ఆధునిక అవసరాలకు అనుగుణంగా మన తెలుగు భాషను మన పద్దతుల్లో అన్వయించుకోవాలి.

విజయవాడ, 6 సెప్టెంబర్ 2025

చదువును, ఉద్యోగాలను మాతృభాషతో అనుసంధానం చేసే దిశగా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు కదలాలని, అప్పుడే ఇంగ్లీషు వ్యామోహం పోతుందని, తద్వారా మన మాతృభాషను పరిరక్షించుకుని, ముందుతరాలకు సగర్వంగా అందించడం సాధ్యమౌతుందని భారతదేశ గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆచార్య తూమాటి దొణ తిమ్మరాయ చౌదరి ( దొణప్ప) గారి ‘శతజయంతి’ సందర్భంలో… ఆయన 30వ వర్ధంతిని పురస్కరించుకుని విజయవాడలోని సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో విశిష్ట తెలుగు దిగ్దర్శనం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ పుస్తక రూపకర్తలైన చెన్నపురి తెలుగు అకాడమీ సభ్యులు శ్రీ తూమాటి సంజీవరావు, శ్రీ తిరునగరి భాస్కర్ లకు, పుస్తకంలోని వ్యాసాలు అందించిన రచయితలకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ అకాడమీ అధ్యక్షులు శ్రీ మలినేని రాజయ్య, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, తెలుగు సాహితీవేత్త డా. సూరం శ్రీనివాసులు సహా తెలుగు భాషాభిమానులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు.

మన జీవన విధానంలో మాతృభాష ఆయువు పట్టు వంటిది అన్న శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు, తెలుగు సంప్రదాయాలను పునరుజ్జీవం చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుకు సంబంధించిన కార్యక్రమాలు మనసుకు సాంత్వన అందిస్తాయన్న ఆయన, తెలుగు భాషకే తన తొలి ప్రాధాన్యత అని తెలియజేశారు. జానపద సాహిత్యం మొదలుకుని… తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి తదితర విభాగాల్లో శ్రీ దొణప్ప గారు చేసిన కృషి మహోన్నతమైనదన్న ఆయన, సాహితీ సవ్యసాచిగా, సాహితీ కృషీవలుడుగా పేరుగాంచిన శ్రీ దొణప్త గారి సంస్కృతాంధ్ర భాషల విద్వత్తు అనితర సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా శ్రీ దొణప్ప గారితో వారికున్న అనుబంధాన్ని పంచుకున్న ఆయన, తెలుగు విశ్వవిద్యాలయ తొలి ఉపకులపతిగా వారిని నియమించిన సందర్భంలో… మంచి నిర్ణయం తీసుకున్నారని శ్రీ ఎన్టీఆర్ గారితో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

తెలుగు భాష సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు, విజ్ఞానం, జానపద రంగం వంటి బహుముఖీనమైన రంగాలలో సమగ్ర వికాసం కోసం, నిరంతరం బోధన, పరిశోధన, ప్రదర్శన, ప్రచురణ కొనసాగాలని శ్రీ ఎన్టీఆర్ గారి ఆకాంక్షలకు అనుగుణంగా శ్రీ దొణప్ప గారు కృషి చేశారన్న శ్రీ వెంకయ్యనాయుడు, ఈనాటి విశ్వవిద్యాలయాలు, తెలుగు శాఖలు ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకోవలసిన అవసరం ఉందన్నారు. ఎంతో మంది మహనీయుల కృషి ఫలితంగా… భారతప్రభుత్వం తెలుగుకు ప్రాచీన హోదా ఇచ్చినా, తెలుగు వెలుగులు భావితరాలకు అందకపోవడం విచారకరమన్న ఆయన… ప్రాచీన తెలుగు హోదా ఫలాలు భవిష్యత్ తరాలకు అందేందుకు తెలుగు వారంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ దిశగా విశిష్ట తెలుగు దిగ్దర్శనం దిశానిర్దేశం చేయగలదన్న ఆయన, ఆధునిక అవసరాలకు అనుగుణంగా మన తెలుగు భాషను మన పద్దతుల్లో అన్వయించుకోవాలని సూచించారు

About The Author