ఏపీకి ఆహ్వానం.. బెంగళూరుకు అవమానమా !?
ఏపీలో పెట్టుబడుల అవకాశాలను లోకేష్ వివరిస్తూ.. తమ రాష్ట్రానికి రావాలని పారిశ్రామికవేత్తలను పిలవడం అవమానంగా భావిస్తున్నారు కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే. సోషల్ మీడియాలో ఆయనది ఎంత విశాలమైన మనస్థత్వమో బయటపడిన తర్వాత మీడియా ఆయన ఎప్పుడు కనిపించినా అదే ప్రశ్నలు వేస్తోంది. దాంతో ఆయన మరోసారి తన తెలివితేటల్ని ప్రదర్శించుకున్నారు. ఏపీకి పెట్టుబడుల్ని ఆహ్వానించడం బెంగళూరును అవమానించడం అని ఆయన అంటున్నారు. అలా ఎలా అని ఆయన సమాధానం విన్నవారికి డౌట్ వచ్చింది.
బెంగళూరులో ఉన్న మౌలిక సదుపాయాల సమస్యలపై ఉన్నన్ని ఫిర్యాదులు దేశంలో మరో నగరంపై ఉండవు. దేశ సిలికాన్ వ్యాలీగా ఎదిగి.. స్టార్టప్ కేంద్రంగా మారిన బెంగళూరును .. పాలకులు నిర్లక్ష్యం చేశారన్నది కళ్ల ముందు ఉన్న నిజం. ఓ ప్రపంచ స్థాయి నగరంగా మార్చి.. విస్తరించుకోవాల్సింది పోయి.. ఇరుకు రోడ్లు.. ఏళ్ల తరబడి సాగే పనులతో .. ప్రజల జీవితాలను నరకం చేశారు. పట్టుమని పది కిలోమీటర్లు నగరంలో ఎక్కడికైనా వెళ్లి రావాలంటే ఆ రోజు షెడ్యూల్ మొత్తం నాశనం అయిపోతుంది బెంగళూరు ప్రజలకు. అలాంటి పరిస్థితి తెచ్చిన పాలకులకు అవమానం కానీ.. నగరానికి కాదు.
బెంగళూరులో ఎన్ని సమస్యలు ఉన్నా ఇన్వెస్టర్లకు ఇప్పటికీ ఆ సిటీనే హాట్ ఫేవరేట్. కానీ ప్రశాంతంగా తమ ఐడియాలను మార్కెట్ చేసుకునేందుకు అవకాశం లేక .. మౌలిక సదుపాయాల కొరత వల్ల ఇబ్బందులు పడటం వారికి ఎలా నచ్చుతుంది ?. అందుకే వారు ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నారు. తమ ప్రాంతాలను బాగు చేసుకోవాలని అనుకుంటున్న వారు.. అలాంటి వారికి ఆహ్వానాలు పంపుతున్నారు. ఈ రోజుల్లో అవకాశాలు వచ్చినప్పుడు అందుకోవడం కాదు.. అవకాశాలు సృష్టించుకున్న వారే విజయం వైపు అడుగులేస్తారు.
కర్ణాటక మంత్రులు .. ఇతర రాష్ట్రాలు తమ పెట్టుబడులను తీసుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నాయని .. ఆయా రాష్ట్రాలపై పడి ఏడ్చే బదులు అసలు తమ సమస్యలేమిటో గుర్తించి వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తే.. ఇతర రాష్ట్రాలకు అలాంటి అవకాశం రాదు. ఎందుకంటే బెంగళూరు ఇప్పటికే టెక్ క్యాపిటల్ గా ఉంది. ఆ అడ్వాంటేజ్ ను నిలబెట్టుకోవాలి కానీ.. ఇతర రాష్ట్రాలపై ఏడిస్తే ఏం ప్రయోజనం ఉండదు. జరగాల్సిన జరిగిపోతుంది !