ఒక సైనికుని కథ. దయచేసి పూర్తి గా చదవండి…

ఒక సైనికుని కథ. దయచేసి పూర్తి గా చదవండి.

కొన్నేళ్ళ క్రితం బెంగళూరులో ఉండే రోజుల్లో ఒకసారి రిజర్వేషన్ చేయించుకోవడానికి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ కి వెళ్లాను. అయిదో ఆరో కౌంటర్స్ ఉన్నాయి…దాంట్లో తక్కువ మంది క్యూ ఉన్న కౌంటర్ చూసుకుని నుంచున్నా… టైం కిల్ చెయ్యడానికి మొబైల్ తీసి ఆడుకుంటున్నాను… ఎప్పట్లాగే నేను నుంచున్న లైన్ తప్ప మిగతా లైన్లన్నీ స్పీడ్ గా కదులుతున్నాయి… కాసేపున్నాక …..క్యూ అసలు కదలడం లేదేమిటా అని అని చూస్తే కౌంటర్ దగ్గర ఒక ఆర్మీ జవాను ఒక చేత్తో రిజర్వేషన్ ఫార్మ్స్ కట్ట రెండో చేత్తో వాళ్ళకొచ్చే కన్సెషన్ ఫార్మ్స్ కట్ట పట్టుకుని ఒకదాని తరువాత ఒకటి ఇస్తున్నాడు. ఈ కన్సెషన్ ఫార్మ్స్ వల్ల మామూలు టికెట్ రిజర్వేషన్ చెయ్యడానికి కన్నా ఎక్కువ టైం పడుతుంది అనుకుంటా… క్యూ జనం లో కొద్ది అసహనం…ఈ లోపు ఒక టికెట్ రిజర్వేషన్ అయిపోగానే… అతను వేరే టికెట్ కి ఫారం ఇచ్చాడు. అప్పటివరకూ ఓపిగ్గా నించున్న జనం లో ఇద్దరు… “ఏం నువ్వొక్కడివే ఇంత టైం తీసుకుంటే మేం ఆఫీసుల్లో పర్మిషన్ తీసుకు వచ్చాం… మేం వెళ్ళొద్దా…ఎంత సేపు నుంచోవాలి అని” అని అరడవడం మొదలు పెట్టారు. అయితే అతను ఆల్రేడి ఒకసారి కొన్ని టికెట్స్ చేయించుకుని మళ్ళీ లైన్ లో వెనుక నుంచుని క్యూ లో వచ్చి మిగతావి చేయించుకుంటున్నాడు అని రిజర్వేషన్ ఆఫీసరు చెప్తున్నాడు కానీ నా వెనుక నుంచున్న ఈ ఇద్దరు వినిపించుకునే స్టేజ్ లో లేరు. వాళ్ళ హిందీ , కన్నడ డైలాగుల్లో కొన్ని అర్ధమయినవి ఏమిటంటే… ఫ్రీ గా టికెట్ వస్తున్నప్పుడు అందరికన్నా వెనక్కి నుంచోవాలి… ఫుల్ డబ్బులిచ్చి కొనుక్కునే వాళ్లకి ప్రిఫెరేన్స్ ఇవ్వాలి అని… ఈ గొడవ జరుగుతుండగా… కొంచెం తటపటాయిస్తూనే ఆ జవాను లాస్ట్ టికెట్ కి రిజర్వేషన్ ఫారం ఇచ్చాడు. అంతే నా వెనుకున్న వాళ్ళు ఇక రెచ్చిపోయి తిట్టడం మొదలు పెట్టారు… దానితో అతను…కొంచెం ఫీల్ అయ్యి…ఇచ్చిన ఫారం మళ్ళీ తీసేసుకుని…వెనక్కి వెళ్లి నుంచున్నాడు…అలా వెనక్కి వెళ్తున్నప్పుడు అతని మొఖం లో ఫీలింగ్స్ చూసి…ఎందుకో నాకు కొంచెం బాధ కలిగింది …వెంటనే నేను లైన్ నుండి తప్పుకుని… అతని వెనుక నుంచున్నా.. నన్ను చూసి ఇంకో ఇద్దరు నా వెనక్కి వచ్చారు. ఆ తరువాత ఆరిచిన వాళ్ళలో ఒకడు కూడా వచ్చి మా వెనుక నుంచున్నాడు …మిగిలిన వాడు మాత్రం ఇవేమీ పట్టనట్టు రిజర్వేషన్ చేయించుకు వెళ్ళిపోయాడు… వాడు వెళ్ళిపోతూ నన్ను కొంచెం చిరాగ్గా చూసి పోయాడనుకోండి…

నా రిజర్వేషన్ అయిపోయాక వెనక్కి వస్తుంటే … నాకు థాంక్స్ చెప్పడానికి ఆ జవాన్ అక్కడే నుంచున్నాడు… చాయ్ తాగుదామా అన్నాడు… నాకు కొంచెం మొహమాటం అడ్డొచ్చినా…సర్లే అని ఓకే అన్నా… అతనికి హిందీ తప్ప ఇంకేం రాదు…నాకు హిందీ అంతంత మాత్రం… ఫ్లాట్ఫాం మీద కాంటీన్ లో టీ తాగుతూ ఉంటే అతను చెప్తున్నాడు… అతనిది ఉత్తరప్రదేశ్ లో ఏదో మారు మూల పల్లె… ట్రైన్ లో డిల్లీ వెళ్లి అక్కడనుండి మళ్ళీ పదహారు గంటలు దూరం వాళ్ళ ఊరు … ఇతని కుటుంబానికి సైనిక నేపథ్యం లేకపోయినా ఆ ఊళ్ళో ఎక్కువ మంది సైన్యం లో పనిచేసేవారేనట…. భార్య , పిల్లలు , తల్లితండ్రులు అక్కడే ఉన్నారు… వాళ్ళని చూసి సంవత్సరం అయిందట… అతనికి అతని కొలీగ్స్ కి కలిపి రిజర్వేషన్ చేయించడానికి వాళ్ళ ఆఫీసరు ఒకరికే పర్మిషన్ ఇస్తాడట అందుకే ఆ పెద్ద కట్ట…. పెద్ద ర్యాంక్ కాకపోవడం తో జీతం అంత ఏమీ ఉండదు అనిపించింది. అలా కాసేపు మాట్లాడాక…వెళ్ళే ముందు టీ కి డబ్బులిస్తుంటే…లేదు లేదు నేను పిలిచాను కాబట్టి నేను ఇవ్వాలి అని పట్టుపట్టి అతనే ఇచ్చి వెళ్ళిపోయాడు…

నేను తిరిగి ఆఫీసుకి వచ్చాక ….జరిగిన సంఘటన మళ్ళీ నెమరు వేసుకున్నా….

అలా నలబై గంటల దూరం లో … అందరిని వదిలేసి…సంవత్సరానికి ఒకసారే మాత్రమే ఇంటికివెళ్ళేలా ఉండే ఊరిలో అప్పుడు నాకు వచ్చే జీతానికి రెట్టింపు జీతం వచ్చే ఒక ఉద్యోగం ఇస్తే నేను వెళ్తానా ?? అని…. ఆ తరువాత…అదే ఉద్యోగం లో ప్రాణాపాయం కూడా ఉంటే…అసలు ఎంత జీతమొస్తే వెళ్ళగలను అని ఆలోచించాను…అప్పుడు అనిపించింది….ఎంత ఇచ్చినా వెళ్ళలేను అని….కావాలంటే మా ఊరు వెళ్ళిపోయి ఆటో నడుపుకుంటూ అయినా బ్రతుకుతాను కానీ… ఆ ఉద్యోగం మాత్రం చెయ్యలేనోమో అనిపించంది….మరి అందరూ నాలానే అనుకుంటే ఇక మన సరిహద్దుని కాపాడేది ఎవరూ?

అప్పుడు అనిపించింది….కొన్ని ఉద్యోగాలు చెయ్యడానికి అర్హత, నైపుణ్యం, ఆకర్షణీయమయిన జీతం ఇవేం సరిపోవు…. ఇంకా ఏదో కావాలి… దాని పేరు ఏమిటో నిర్వచించలేను కానీ… అది ఉన్నది మాత్రం ఈ రైతు కి , జవాను కి మాత్రమే….

మనం రెండుపూట్లా కడుపునిండా తిని కంటినిండా నిశ్చింతగా నిద్రపొవడానికి కారణమయిన వీళ్లకి ఏమిచ్చి వాళ్ళ రుణం తీర్చుకోగలం…. కనీసం కొంచెం గౌరవం ?

About The Author