5 ముఖ్యాంశాలతో కాంగ్రెస్ మేనిఫెస్టో… రాహుల్
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎపి కి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ స్పష్టం చేశారు. మంగళవారం కాంగ్రెస్ అధ్యక్షునిగా రాహుల్ తొలిసారి కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. గత ఏడాదిగా మేనిఫెస్టో పై కసరత్తు చేస్తున్నామన్నారు. మేనిఫెస్టోలో అన్ని వాస్తవాలే ఉండాలని నిర్ణయించినట్లు తెలిపారు. మేనిఫెస్టోలో అయిదు ముఖ్యాంశాలు పొందుపరచబడ్డాయన్నారు. హస్తం గుర్తును సూచించేలా అయిదు ముఖ్యాంశాలకు చోటు కల్పించామన్నారు. అయిదింటిలో ముఖ్యమైనది ‘న్యాయ్’ అని పేర్కొన్నారు. దేశంలోని 20 శాతం పేదలకు ఏడాదికి రూ.72 వేల ఆర్థిక సాయాన్ని నేరుగా అందిస్తామన్నారు. రెండో ముఖ్యాంశంగా ఉద్యోగ కల్పన గురించి ప్రస్తావించారు. మొత్తం 22 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రాహుల్ తెలిపారు. యువకులు వ్యాపారం చేయాలనుకుంటే మూడేళ్లపాటు ఎలాంటి పర్మిషన్ అక్కర్లేదని చెప్పారు. ఉపాధి హామీ పథకం 100 నుండి 150 రోజులకు విస్తరిస్తామని పేర్కొన్నారు. ధనవంతులు రుణాలు తీసుకొని ఎగవేస్తున్నారని, నిజమైన రైతులు బ్యాంకు లోన్ తీసుకొని కట్టకపోతే క్రిమినల్ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఇకపై రైతులు లోన్లు కట్టలేకపోతే క్రిమినల్ కేసులుండవని రాహుల్ స్పష్టం చేశారు. విద్యారంగానికి బడ్జెట్లో 6 శాతం నిధులు కేటాయించామన్నారు. ప్రభుత్వ వైద్యాన్ని మరింత మెరుగు పరుస్తామని చెప్పారు. గత అయిదేళ్లలో మోడి ప్రభుత్వం దేశాన్ని విభజించేందుకు ప్రయత్నించిందని, తాము ఒక్కటి చేసేందుకు ప్రయత్నిస్తామని రాహుల్ వ్యాఖ్యానించారు. గతంలో హామీ ఇచ్చినట్లుగానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎపి కి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ స్పష్టం చేశారు.
*రైతులకు ప్రత్యేక బడ్జెట్: రాహుల్ గాంధీ.*
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఇవాళ రిలీజ్ చేసిన తన ఎన్నికల మేనిఫెస్టోలో అయిదు అంశాలకు విశిష్ట స్థానం కల్పించింది. న్యాయ్ స్కీమ్‌తో నిరుపేదలకు కనీస ఆదాయం కల్పిస్తామని రాహుల్ అన్నారు. ప్రతి అకౌంట్‌కు మోదీ 15 లక్షలు ఇస్తానన్నారు, కానీ అదో అబద్దం అని తేలింది, పౌరులకు ఎంత ఇవ్వగలమో పార్టీ నేతలంతా కలిసి నిర్ణయించామని, పేదరికంపై యుద్ధం చేయాలని నిర్ణయించామని, అందుకే ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి 72వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఇక ప్రభుత్వం ఉద్యోగానలను భర్తీ చేయడం రెండవ టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఉద్యోగాల కల్పన రెండవ అతిపెద్ద సమస్య అన్నారు. 22 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు. గ్రావిూణ ప్రాంతాల్లోనూ మరో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని రాహుల్ హావిూ ఇచ్చారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అనుమతులు ఇవ్వడం మూడవ టార్గెట్. మొదటి మూడేళ్ల వరకు కంపెనీలు పెట్టుకునే వారు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వారికి పన్ను మినహాయింపులను కూడా కల్పించనున్నారు.
జాతీయ ఉపాధి హావిూ పథకం కింద ప్రస్తుతం వంద రోజులకు పని దినాలను కల్పిస్తున్నారు. దాన్ని ఇప్పుడు 150 రోజులకు పెంచనున్నట్లు రాహుల్ చెప్పారు. రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు రాహుల్ చెప్పారు. రైల్వే బడ్జెట్ తరహాలో ప్రత్యేకంగా రైతులకు బడ్జెట్ సమర్పించనున్నట్లు రాహుల్ చెప్పారు. రుణాలు చెల్లించలేని రైతులపై క్రమినల్ చర్యలు తీసుకోమన్నారు. మొహుల్ చోక్సీ, విజయ్ మాల్యాలు దేశం విడిచి పరారయ్యారు, కానీ రైతులు మాత్రం జైలుపాలవుతున్నారు, అయితే రుణాలు చెల్లించలేకపోతున్న రైతులపై నేరాభియోగం ఉందని రాహుల్ అన్నారు.
జీడీపీలో ఆరు శాతాన్ని విద్య కోసం ఖర్చు చేయనున్నారు. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేస్తామన్నారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలను అందిచనున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న జీఎస్టీ స్థానంలో జీఎస్టీ 2.0ను అమలు చేయనున్నట్లు చెప్పారు. స్టాండర్డ్ రేట్ ఆధారంగా ట్యాక్సులను వసూల్ చేస్తామన్నారు. తాను ప్రధాని అయ్యే అంశం ప్రజలపై ఆధారపడి ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో జరిగిన అవకతవకలపై విచారణ చేపడుతామన్నారు.