నపుంసకుడని పిలిస్తే పరువు నష్టమే బొంబాయి హైకోర్టు స్పష్టీకరణ…

నపుంసకుడని పిలిస్తే పరువు నష్టమే
బొంబాయి హైకోర్టు స్పష్టీకరణ
మగవాళ్లను ‘నపుంసకుడు’ అని పిలిస్తే వారి పరువుకు నష్టం కలిగించినట్లేనని బొంబాయి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పదం మగవాళ్లపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని వ్యాఖ్యానించింది. ఇలాంటివి ఉపయోగిస్తే పరువు నష్టం కేసుల్లో చర్యలు ఎదుర్కొనక తప్పదంది. ఒక విడాకుల కేసుకు సంబంధించి ఈ తీర్పు చెప్పింది. 2016లో నాగ్‌పుర్‌కు చెందిన దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో విడాకులు కోరుతూ సదరు మహిళ తన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే వారి కుమార్తె సంరక్షణ బాధ్యతలను తాత్కాలికంగా భర్తకే కోర్టు అప్పగించింది. దీంతో ఈ తీర్పును ఆమె బొంబాయి హైకోర్టుకు చెందిన నాగ్‌పుర్‌ ధర్మాసనంలో సవాల్‌ చేశారు. తన భర్త నపుంసకుడని పిటిషన్‌లో ఆమె ఆరోపించారు. దీంతో ఆమెతోపాటు ఆమె బంధువులపైనా భర్త పరువు నష్టం కేసు వేశారు. దీన్ని కొట్టివేయాలని ఆమె నాగ్‌పుర్‌ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ‘‘అగౌరవ పరిచాలనే ఉద్దేశంతో ఆ పదాన్ని ఉపయోగించలేదు. మా పాప కూడా అధునాతన సంతాన చికిత్స ద్వారా జన్మించింది.’’అని అభ్యర్థనలో ఆమె వివరించారు. ఈ అభ్యర్థనపై జస్టిస్‌ సునిల్‌ శుక్రే విచారణ చేపట్టారు. వైద్య స్థితిని తెలియజేసేందుకే ఆ పదాన్ని ఉపయోగించినప్పటికీ.. దాంతో జరిగే నష్టాన్ని పరిగణనలోకి తీసుకోలేకుండా ఉండలేమని ఆయన స్పష్టీకరించారు.

About The Author