మాధవం వసతి సముదాయంలో జెఈవో తనిఖీలు
తిరుపతిలోని మాధవం వసతి సముదాయంలో బుధవారం టిటిడి తిరుపతి జెఈవో శ్రీబి.లక్ష్మీకాంతం తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలను కల్పించాలని, గదులు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. మాధవం, శ్రీనివాసం వసతి సముదాయాలలో బెడ్‌షీట్లు, దిండుకవర్లు, కుర్చీల కవర్లను ఎప్పటికప్పుడు మార్చాలని సూచించారు. పారిశుద్ధ్యం కోసం ఆరోగ్యశాఖాధికారులు నిత్యం పర్యవేక్షణ చేపట్టాలన్నారు. వేసవి నేపథ్యంలో తాగునీటి కొరత, విద్యుత్ కోత లేకుండా చూడాలన్నారు. వసతిగదుల నియమనిబంధనలను భక్తులు సులభంగా గుర్తించేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని కోరారు. భక్తుల పట్ల మరింత గౌరవభావంతో మెలగాలని, ఫిర్యాదులు రాకుండా సేవలందించాలని సూచించారు. మాధవం, శ్రీనివాసం వసతి సముదాయాలలో ఐఎస్‌వో గుర్తింపుకోసం అవసరమైన నాణ్యతా ప్రమాణాలను పాటించాలని ఆదేశించారు.
అనంతరం అలిపిరిలో నిర్మాణంలో ఉన్న ఎస్వీబీసీ నూతన భవనాన్ని పరిశీలించారు. ఆధునిక సాంకేతిక హంగులతో నూతన స్డూడియోను నిర్మించాలని సూచించారు.
జెఈవో వెంట టిటిడి ప్రత్యేకాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి, డిప్యూటీ ఈవో శ్రీ రామ్మూర్తిరెడ్డి, ఈఈ శ్రీ వెంకటకృష్ణారెడ్డి, ఏఈవో శ్రీ శంకరరాజు ఇతర అధికారులు ఉన్నారు.