అమ్మో షుగర్ జబ్బు..
మధుమేహం ఒంటరిగా రాదు. వస్తూ వస్తూ గుండెజబ్బు, కిడ్నీ వైఫల్యం, పక్షవాతం, అంధత్వం, నాడీ సమస్యల వంటి ముప్పులనూ వెంటబెట్టుకొస్తుంది. మధుమేహం బయటపడిన తొలిరోజుననే 50% మందిలో గుండెజబ్బు ముప్పు కారకాలు ఉంటుండటం గమనార్హం. మిగతావారితో పోలిస్తే మధుమేహంతో బాధపడేవారిలో దీర్ఘకాల కిడ్నీజబ్బు నాలుగు రెట్లు ఎక్కువ కూడా! అంతేకాదు.. అంధత్వానికి మధుమేహం ప్రధాన కారణంగా మారటం.. మధుమేహం దాడిచేసిన పదేళ్ల లోపే దాదాపు అందరిలోనూ నాడులు దెబ్బతిని పోతుండటం పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతోంది. అందుకే గుంపులో గోవిందంలా అందరికీ ఒకే చికిత్స కాకుండా ఆయా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని బట్టి మందులను ఎంచుకోవాలని అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ నినదిస్తోంది. ఇతరత్రా సమస్యలనూ దృష్టిలో పెట్టుకొని.. కుడి ఎడమలు కానీయకుండా సరైన మందులను ఎంచుకుంటే మరింత మెరుగైన ఫలితం కనబడుతుందని తాజా మార్గదర్శకాల్లో సూచించింది. రక్తంలో గ్లూకోజు ఎక్కువగా ఉండటం కన్నా మరీ పడిపోతే కలిగే హానే ఎక్కువంటూ హైపోగ్లైసీమియా నివారణకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది.
మందులు ఎలా…?
———————
మధుమేహం ఉందని బయటపడగానే చాలామంది ముందుగా బరువు తగ్గించుకోవటం గురించే ఆలోచిస్తుంటారు. వ్యాయామాలు, ఆహార నియమాలతోనే గ్లూకోజు స్థాయులను నియంత్రించుకోవచ్చని భావిస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. మధుమేహం బయటపడిన తొలిరోజు నుంచే మెట్‌ఫార్మిన్ మందు ఆరంభించాలి. దీన్ని వాడుకుంటూ.. బరువును అదుపులో ఉంచుకోవటం, శారీరక శ్రమ, వ్యాయామాల వంటివి కొనసాగించాలి. అంతే తప్ప కేవలం వ్యాయామాలు, శారీరకశ్రమతోనే గ్లూకోజు స్థాయులను నియంత్రణలోకి తెచ్చుకోవటానికి ప్రయత్నించటం తగదు. రక్తంలో గ్లూకోజు స్థాయులను బట్టి 500 మి.గ్రా. నుంచి 2,000 మి.గ్రా. వరకూ మెట్‌ఫార్మిన్ వాడుకోవాల్సి ఉంటుంది. దీన్ని మూడు నెలల పాటు తీసుకున్నాక హెచ్‌బీఏ1సీ పరీక్ష చేయించాలి. ఇందులో మూడు నెలల కాలంలో రక్తంలో గ్లూకోజు స్థాయుల సగటు బయట పడుతుంది. ఇది 7% లోపునకు చేరుకోకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రెండో మందును ఆరంభించాల్సి ఉంటుంది.
మెట్‌ఫార్మిన్‌తో విటమిన్ బి12 మోతాదులు తగ్గే అవకాశముంది. కాబట్టి అవసరమైతే బి12 మాత్రలు, ఇంజెక్షన్లు తీసుకోవాలి. రక్తహీనత లేదా కాళ్లు చేతుల్లో నాడులు దెబ్బతిన్నవారికిది మరింత ముఖ్యం.
మధుమేహం సంక్లిష్ట సమస్య.
ఒకసారి వచ్చిందంటే పోయేది కాదు.
దీన్ని నియంత్రించుకోవటం తప్ప చేయగలిగిందేమీ లేదు. ఒకవైపు- శక్తినిచ్చే గ్లూకోజు రక్తంలో దండిగా ఉన్నా కణాలు దాన్ని సరిగా స్వీకరించలేక రోజురోజుకీ అవయవాలు చతికిల పడిపోతుంటాయి. మరోవైపు- రక్తంలో గ్లూకోజు మోతాదులు ఎప్పుడూ ఎక్కువగా ఉండటం రక్తనాళాలను దెబ్బతీస్తుంటుంది. మధుమేహంలో తలెత్తే దుష్ప్రభావాలన్నింటికీ ఇదే మూలం. రక్తనాళాలు దెబ్బతిన్న చోట క్రమంగా కొవ్వు పేరుకోవటం.. చివరికి పూడికలుగా ఏర్పడటం.. ఫలితంగా గుండెపోటు ముప్పు పెరగటం.. అంతా ఒక విష వలయంగా తయారవుతుంది. కిడ్నీల సామర్థ్యం తగ్గిపోయి వడపోత ప్రక్రియ కూడా మందగిస్తుంది. అంతేకాదు, సూక్ష్మరక్తనాళాలు దెబ్బతినటం మెదడు, కళ్ల వంటి సున్నిత అవయవాల మీదా విపరీత ప్రభావం పడుతుంది. నాడులు దెబ్బతినటం వల్ల కాళ్లు చేతుల వంటి భాగాల్లో స్పర్శ కూడా తగ్గిపోతుంది. అందుకే రక్తంలో గ్లూకోజు స్థాయులు నియంత్రణలో ఉండేలా చూసుకోవటం తప్పనిసరి. ఇందులో జీవనశైలి మార్పులతో పాటు మందుల పాత్ర చాలా కీలకం.