భాగవతము -6 వ భాగం:


మీరు ఎక్కడ కూర్చుని వున్నా మీ మనస్సు మీకు ఇష్టమయిన వస్తువును గూర్చి స్మరిస్తూ ఉంటుంది. మనస్సు ఆవస్తువునండు ప్రీతిచెందింది కాబట్టి ఎప్పుడూ ఆ వస్తువును స్మరిస్తూ ఉంటుంది. మీ మనస్సు ఈశ్వరునియందు ప్రీతిచెందకపోతే ఈశ్వరుని నామమును స్మరించదు. ఇప్పుడు మనస్సు భగవంతుని పట్ల ప్రీతితో తిరగడానికి కావలసిన బలమును వ్యాసభగవానుడు భాగవతమునందు ప్రతిపాదన చేస్తున్నారు. అందుకే భాగవతమును ఎవరు వింటారో వారి మనస్సు తెలిసో తెలియకో ఈశ్వరుని వైపు తిరిగిపోతుంది.

శుకబ్రహ్మ పరీక్షిత్తు సమక్షంలో ఏడురోజులపాటు భాగవత ప్రవచనమును చేశారు. దాని ఫలితం ఏమిటి? తాను చనిపోతానని బెంగపెట్టుకున్న పరీక్షిత్తు భాగవతమునంతటిని విన్నాడు. విన్న తరువాత ఆయన అన్నాదు – ’ఈ శరీరం చచ్చిపోతుంది – బెంగలేదు’ అన్నాడు. ఆయనకు తెలిసిపోయింది. ఏమిటి? చనిపోవడం అనేది అసలు ఆత్మకు లేదు. మరి చనిపోయేది ఏది? శరీరం. పుణ్యంచేసినా యజ్ఞంచేసినా యాగం చేసినా తపస్సు చేసినా, అశ్వమేధయాగములు చేసినా తాను ధనుస్సు పట్టుకుని దేవతల పక్షాన నిలబడి యుద్ధం చేసినా కల్పములు మారిపోయినా యుగములు మారిపోయినా శరీరము పడకుండా ఉంటుందా? ఉండదు. పడితీరుతుంది. ధ్రువుడంతటివాని శరీరం పడిపోయింది. ఎవని శరీరం అయినా పడిపోవలసిందే! పడిపోయేటటువంటి సత్యము శరీరమునకు చెందినది. అది పడిపోయి తీరుతుంది. కానీ పడదు పడదు అని ఒక అసత్యమునందు నీవు ఒక పూనిక పెట్టుకొని ఉన్నావు. ఈ భ్రాంతిచేత లోకమునందు సంగమము కలిగి చేయకూడని పనులన్నింటిని చెయ్యడానికి పూనుకుంటున్నావు. ఈ శరీరం ఉండిపోతుందన్న భ్రాంతిని పొందుతున్నావు. వెళ్ళవలసింది వెళ్ళిపోయి తీరుతుంది. వెళ్ళనిది ఎప్పుడూ వెళ్ళదు. కాబట్టి ’నేను’ అనబడినది ఆత్మ అయితే దానికి చావులేదు. ’నేను’ అనబడునది శరీరం అయితే అది చచ్చిపోయి తీరుతుంది. కాబట్టి ఉన్న సత్యవస్తువును పట్టుకుంటే మరణ భయంలేదు. అసత్యవస్తువును పట్టుకుంటే మరణ భయం ఉంది. మరణభయంలో సమస్తమయిన అజ్ఞానం ఉంది. అవిద్య ఉంది. భయం ఉంది. ఏది పట్టుకుంటావు? సత్యమును పట్టుకో. అది అంత తేలికయిన విషయం కాదు. భాగవతమును వినినివాడు మాత్రమే సత్యమును తేలికగా పట్టుకొనగలడు. అలా పట్టుకునేటట్లు సత్యవస్తువు గురించి వ్యాసుడు తన భాగవతమునందు ప్రతిపాదన చేశారు. అందుకని ఎవరు భాగవతమును వింటున్నారో చదువుతున్నారో వారికి సత్యముపట్ల పూనిక కలుగుతుంది. ఈశ్వరుని పట్ల పూనిక కలుగుతుంది. ఆయన పాదములు పట్టుకున్నవాళ్ళు ఎలా తరించారో భగవంతుని భక్తుల గాథలు ఆవిష్కరింపబడతాయి.

ఏడురోజులు భాగావతమును వినిని పరీక్షిత్తుకు మరణము రాకుండా పోలేదు. మరణం వచ్చింది. కానీ ఆ ఏడురోజులు పోయిన తరువాత పరమ ధైర్యంతో ఒక మాట అన్నాడు. – ’శరీరమునకు మరణం వచ్చినా నాకు బెంగలేదు. ఇపుడు నేను ఆత్మగా నిలబడిపోతున్నాను’ అన్నాడు. ఈ శక్తి కొన్ని కోట్ల జన్మలలో లోపించడం వలన మనం అలా తిరుగుతూనే ఉన్నాము. ’మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషీ’ (సౌందర్యలహరి – 97) అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. అలా మాయలో తిరుగుతూనె ఉన్నాము. ఈ సత్యమును భాగవతం ఆవిష్కరిస్తోంది .. 

About The Author