జెట్‌ ఎయిర్‌వేస్ సేవలను ఆపేయడంతో ఆ సంస్థ ఉద్యోగులు రోడ్డునా….


ఆర్థిక సంక్షోభం కారణంగా జెట్‌ ఎయిర్‌వేస్ సేవలను ఆపేయడంతో ఆ సంస్థ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. కొద్ది నెలలుగా జీతాలు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సంక్షోభం కారణంగా బుధవారం రాత్రి నుంచి తాత్కాలికంగా సేవలను నిలిపివేయనున్నట్లు జెట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆ సంస్థ ఉద్యోగులు దిల్లీ, ముంబయిలో శాంతియుత నిరసన చేపట్టారు.

భోజా పూజారి అనే ఉద్యోగి మాట్లాడుతూ..‘ 26 ఏళ్లుగా ఇదే సంస్థను నమ్ముకుని ఉన్నాను. ఈ సంస్థను స్థాపించినప్పుడు నేను ఇందులో చేరాను. ఇన్నేళ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ తలెత్తలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే మేం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రెండు రోజులుగా నిద్రే లేదు. నేను మా పిల్లలకు ఈ విషయాలన్నీ చెప్పలేదు. ఎందుకంటే వాళ్లు చాలా చిన్న పిల్లలు. కొన్ని రోజుల తర్వాత వారికి తిండి పెట్టడం కూడా కష్టమవుతుందేమోనని భయంగా ఉంది’ అంటూ బోరున విలపించారు.
మరో ఉద్యోగి చైతన్య మాట్లాడుతూ..‘ దయచేసి మా కుటుంబాలను కాపాడండి. మా ఉద్యోగ ప్రభావం మా పిల్లల మీద పడుతోంది. ఇప్పుడు మేం రోడ్డున పడాల్సి వచ్చింది. నాలుగు నెలలుగా మాకు జీతాల్లేవు. పిల్లల చదువులు, ట్యూషన్‌ ఫీజులు కట్టడానికి మా దగ్గర డబ్బుల్లేవు’ అని వాపోయారు.

జెట్‌కు నిధులు సమకూర్చే విషయమై సోమవారం నుంచి బ్యాంకర్లు, జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రతినిధుల మధ్య సుదీర్ఘ సమావేశాలు జరిగాయి. జెట్ సంస్థ సేవలు నిలిచిపోకుండా కొనసాగేందుకు రూ. 400 కోట్లు అత్యవసర రుణం కావాలని ఆ సంస్థ యాజమాన్యం వారికి తెలిపింది. అయితే అప్పటి వరకు జెట్‌ యాజమాన్యాన్ని ఊరించిన రుణ దాతలు, బ్యాంకులు చివరి నిమిషంలో చేతులెత్తేశారు. ఒకప్పుడు 123 విమానాలతో దిగ్విజయంగా సేవలందించగా ప్రస్తుతం ఆ సేవలను తాత్కాలికంగా నిలిపేసింది.

About The Author