చంద్రబాబుకు షాక్ః సెలవుపై ఆర్ధికశాఖ కార్యదర్శి…
చంద్రబాబుకు షాక్ః సెలవుపై ఆర్ధికశాఖ కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడి ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది.
ఇన్నాళ్లూ చంద్రబాబునాయుడి అండదండలతో అధికారాన్ని యధేచ్ఛగా అనుభవించిన ఆ రాష్ట్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి మద్దాడ రవిచంద్రను ఊహించని విధంగా బలవంతంగా సెలవుపై పంపారు.
సెలవుపై బలవంతంగా పంపారా లేక ప్రభుత్వ వర్గాలలో జరుగుతున్న పరిణామాలను చూసి ఆయనే భయపడి సెలవు పెట్టారా అనే విషయం ఇంకా స్పష్టం కాలేదు.
కానీ ఆయన మాత్రం ఈ నెల 22 నుంచి వచ్చే నెల 17 వరకూ సెలవు పెట్టారు.
ఇది ప్రభుత్వానికి, చంద్రబాబునాయుడికి మరీ ముఖ్యంగా ఆర్ధిక శాఖ కార్యదర్శి మద్దాడ రవిచంద్రకు ఊహించని షాక్ అని చెప్పవచ్చు.
ఆర్ధిక శాఖ కార్యదర్శిగా మద్దాడ రవిచంద్ర నియమితుడైన నాటి నుంచి జరిగిన ఆర్ధిక లావాదేవీలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం కూలంకషంగా పరిశీలించడంతో అసలు బండారం బయటపడింది. దాంతో రవిచంద్రపై వేటు పడింది.
గత ఐదేళ్లలో చంద్రబాబునాయుడు జైకా, ప్రపంచ బ్యాంకు, హడ్కోలాంటి సంస్థల నుంచి మూడున్నర లక్షల కోట్ల రూపాయల మేరకు రుణాలు తీసుకువచ్చారు.
కేంద్ర ప్రభుత్వ హామీతో ఈ నిధులను రాష్ట్రానికి తెప్పించిన చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిధులను సక్రమంగా ఉద్దేశించిన కార్యక్రమాలకు కాకుండా భారీ ఎత్తున మళ్లింపులు చేసింది.
ఈ మళ్లింపులు వేరే పథకాలకు చేసి ఉంటే ఫర్వాలేదులే అనుకోవచ్చు.
కానీ ఈ నిధులను కేవలం వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకు పంచిపెట్టడానికి వినియోగించారని ప్రాధమిక విచారణలో తేలింది.
చీఫ్ సెక్రటరీ ఆధీనంలో కీలక ఫైళ్ళు
దాంతో సంబంధిత అన్ని ఫైళ్లను చీఫ్ సెక్రటరీ తన స్వాధీనంలోకి తీసుకున్నారు. నిన్న రవిచంద్రను పిలిపించి వివరణ కోరడంతో ఆయన తెల్లమొహం వేశారని విశ్వసనీయంగా తెలిసింది.
తనకు సంబంధంలేదని ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు చేశానని రవిచంద్ర చెప్పారని తెలిసింది.
దాంతో చీఫ్ సెక్రటరీ ఎల్ వి సుబ్రహ్మణ్యం చిరాకుగా మనం ఐఏఎస్‌లం అయింది రాజకీయ నాయకులు చెప్పినట్లు గుడ్డిగా చేయడానికా అని ప్రశ్నించినట్లు తెలిసింది.
అన్ని ఫైళ్లను పేరు పేరునా ఒక్కొక్కటి తెరచి వాటిపై వివరణ కోరడంలో రవిచంద్ర బెంబేలెత్తినట్లు చెబుతున్నారు.
హడ్కో నుంచి ఇళ్లు కట్టడానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకుని ఆ నిధులను తమకు కావాల్సిన కాంట్రాక్టర్లకు మళ్లించారు.
ఆ కాంట్రాక్టర్లు ఇళ్లు కట్టిన కాంట్రాక్టర్లు కాదు. వేరు పనులు చేసిన వారు. దీన్ని ప్రభుత్వ నిబంధనలు అనుమతించవు.
అయినా గత ఐదేళ్లలో ఇలాంటి అవకతవకలకు చంద్రబాబునాయుడి ప్రభుత్వం పాల్పడింది.
ఈ అన్ని చర్యలకు కీలక పాత్రధారిగా ఆర్ధిక కార్యదర్శి రవిచంద్రను చీప్ సెక్రటరీ నిర్ధారించుకున్నారు.
తప్పుల తడకలుగా ఆర్ధిక శాఖ జీవోలు
రవి చంద్ర ఆధ్వర్యంలోని ఆర్ధిక శాఖ ఇచ్చిన జీవోలు అన్నీ తప్పుల తడకలుగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ జీవోలన్నీ నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లకు నిధులు పంచి పెట్టే విధంగా ఉన్నట్లు కూడా సమాచారం. దాంతో ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ కార్యదర్శి మద్దాడ రవిచంద్రకు ఈ షాక్ తగిలింది. ఇంతే కాదు ఈ కేసును దర్యాప్తు సంస్థలకు అప్పగించేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే జరిగితే రవిచంద్ర తాను చేసిన కార్యక్రమాలన్నింటికి వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. తాను ఇచ్చిన జీవోలను సమర్ధించుకోవాల్సి ఉంటుంది. దర్యాప్తు సంస్థలు కనుక క్విడ్ ప్రోకో గానీ మరే ఇతర కోణంలోగానీ దర్యాప్తు జరిపితే రవిచంద్రతో బాటు ప్రభుత్వంలో అధికారం చెలాయించిన పెద్దలు అందరూ ఇరుక్కునే అవకాశం కనిపిస్తున్నది. దర్యాప్తు సంస్థలు చేసే వాకబులో ఎలాంటి విషయాలు వెల్లడి అవుతాయో ఇప్పుడే చెప్పడం కష్టం కానీ ఆర్ధిక శాఖ ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి అవసరమైన వారికి నిధులు పంపకం చేసేందుకు అడ్డగోలుగా జీవోలు ఇచ్చారని మాత్రం ఇప్పటికే ఖరారు అయింది. అందుకోసమే రవిచంద్రపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు ముందడుగు వేస్తున్నారు.
ప్రస్తుతం ఈ తప్పుడు జీవోల అంశం మొత్తం కేంద్ర ఎన్నికల సంఘానికి చేరింది. ఎన్నికల సంఘం ఈ 10 లేదా 15 రోజులలోనే చర్యలకు ఉపక్రమించేందుకు కూడా అవకాశం కనిపిస్తున్నది.
ఇదే జరిగితే రవిచంద్ర ఆయనతో బాటు ప్రభుత్వ పెద్దలు కూడా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినట్లే.