నేడు జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం..


జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవంను 1993 ఏప్రిల్ 24 నుండి అమలులోకి వచ్చిన 1992 రాజ్యాంగ (73వ సవరణ) చట్టం, గుర్తుగా నిర్వహిస్తారు…

గ్రామస్థాయిలో అమల్లో ఉండే అతి ప్రాచీన పాలనా వ్యవస్థే పంచాయతీ. దీన్నే స్థానిక స్వపరిపాలనా సంస్థల వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థ అని కూడా అంటారు.

గ్రామ రాజ్యం ద్వారా రామరాజ్యం ఏర్పాటు చేయాలని గాంధీజీ కలలు కన్నారు.ఆయన దృష్టిలో ప్రతి గ్రామపంచాయతీ ఒక చిన్న గణతంత్ర రాజ్యం. దేశాభివృద్ధికి మూలం గ్రామాభివృద్ధే. అందువల్ల గ్రామాభ్యుదయానికి గ్రామపంచాయతీల ఏర్పాటు, వాటికి విస్తృత అధికారాలు ఇవ్వడానికి రాజ్యాంగం ప్రాధాన్యం ఇచ్చింది.

పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామాల అభివృద్ధికి ఆ గ్రామ ప్రజలే పాటుపడటానికి వీలు కల్పించారు. ప్రాచీన కాలంలో పనిచేస్తున్న గ్రామపాలన వ్యవస్థ అప్పటి సాంఘిక పరిస్థితులకు అనుగుణంగా అయిదు ప్రధాన వృత్తుల ప్రతినిధులతో పనిచేసేది. అయితే ఇది ఎక్కువగా అణిచివేతకు గురయ్యేది.

బ్రిటిష్ పాలనా ప్రారంభంలో అంతగా ఆదరణకు నోచుకోకపోయినప్పటికీ జనరల్ గవర్నర్ ‘రిప్పన్’ ప్రోత్సాహంతో స్థానిక స్వపరిపాలనా సంస్థలు పునరుజ్జీవనం పొందాయి. 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాలు కొంతమేరకు వీటికి బలాన్ని చేకూర్చాయి.

భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించిన తొలి రాష్ట్రం రాజస్థాన్ కాగా, ఆంధ్రప్రదేశ్ రెండోది. 1959 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్లోని మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో ఈ వ్యవస్థను ప్రారంభించారు.

73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1994లో కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని చేసింది. ప్రస్తుత వ్యవస్థ దీనికి అనుగుణంగా ఉంది.కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ రాష్ట్రాల మంత్రిత్వ శాఖలతో దీనికి సంబంధించిన కార్యక్రమాలను చేపడుతుంది.

ఏప్రిల్ 24ను పంచాయతీరాజ్ దినంగా పాటిస్తున్నారు. దాదాపు 30 లక్షల మంది ప్రజాప్రతినిధులతో నడుస్తున్న పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రధానంగా మన గ్రామాలకు ఇది వెన్నెముకగా పనిచేస్తుంది.

దేశవ్యాప్తంగా..

537 జిల్లాపంచాయతీలు..

6097 మండల పంచాయతీలు…

2,34,676 గ్రామపంచాయతీలు పనిచేస్తున్నాయి.

జిల్లా పంచాయతీ స్థాయిలో 11,825 మంది ప్రతినిధులు…

మండల పంచాయతీ స్థాయిలో 1,10,070 మంది ప్రతినిధులు…

గ్రామపంచాయతీ స్థాయిలో 20,73,715 మంది ప్రతినిధులు ఓటర్ల ద్వారా ఎన్నికయ్యారు.

#పంచాయతీరాజ్_ఎందుకు?

?వనరుల పంపిణీలను మెరుగుపరచడానికి…

?ప్రభుత్వ పనుల్లో స్థానికులు పాల్గొనేలా చేయడానికి…

?గ్రామీణ ప్రజల దైనందిన అవసరాలను మేలైన పద్ధతిలో తీర్చడానికి…

?స్థానికంగా అధికంగా ఉద్యోగాలు కల్పించడానికి.
పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేయడానికి…

పంచాయతీలకు వాస్తవమైన అధికారాలను అందిస్తే స్వావలంబన, స్వీయ చొరవను, సహకారాన్ని పెంపొందించి గ్రామీణ సమాజ రూపురేఖలను మార్చడానికి దోహదం చేస్తాయి.

ప్రజలు పాల్గొనే ప్రజాస్వామ్యానికి రూపకల్పన చేస్తాయి. పంచాయతీరాజ్ వ్యవస్థ వల్ల ప్రతి చిన్న పనికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడటం జరగదు. కేంద్ర, రాష్ట్ర పాలనా యంత్రాంగంపై అధిక పనిభారాన్ని, ఒత్తిడిని తగ్గించడం. ఆలస్యాన్ని నివారించి ప్రజల సమస్యలపై ప్రభుత్వం త్వరగా స్పందించేలా చేయడం. సేవల పరిమాణాలను పెంచడం, వికేంద్రీకరణ పంచాయతీరాజ్ ముఖ్య ధ్యేయాలు…

About The Author