గుండెజబ్బులు రాకుండా ఉండాలంటే…
గుండెజబ్బులు రాకుండా ఉండాలంటే…
రాత్రిపూట మజ్జిగలో అన్నం వేసి పులియబెట్టిన తరవాణిని పాత తరంవాళ్లు తింటుంటారు. ఉదయాన్నే అది తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అనీ చెబుతారు. ఆ విషయాన్నే ప్రయోగపూర్వకంగా చెబుతున్నారు యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్రన్ ఫిన్‌ల్యాండ్‌కు చెందిన పరిశోధకులు. ముఖ్యంగా పులియబెట్టిన పాల ఉత్పత్తులైన పెరుగు, మజ్జిగ, చీజ్… వంటి వాటిల్లో ప్రొటీన్లూ ఇతరత్రా పోషకాలతోబాటు కాల్షియం, విటమిన్-డి సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల హృద్రోగాలు వచ్చే అవకాశం తగ్గుతుంది అంటున్నారు. ఇందుకోసం వీళ్లు రెండువేలమందిని ఎంపికచేసుకుని దాదాపు ఇరవయ్యేళ్లపాటు వాళ్ల ఆహారపుటలవాట్లని నిశితంగా గమనించగా- అందులో పులియబెట్టిన పాల ఉత్పత్తులు తినేవాళ్లలో- తిననివాళ్లతో పోలిస్తే హృద్రోగాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. తెలిసి చేసినా తెలియక చేసినా మనం తినే పెరుగు, ఇడ్లీ, దోసె… వంటివన్నీ కూడా పులియబెట్టడం ద్వారా వచ్చినవే. కాబట్టి అవి ఆరోగ్యానికి అన్నివిధాలా మంచివేనన్నమాట.