శ్రీముఖలింగేశ్వరస్వామి దేవాలయం– శ్రీముఖలింగం.
ముఖలింగేశ్వరస్వామి దేవాలయం– శ్రీముఖలింగం.
శ్రీముఖలింగం దేవాలయం శ్రీకాకుళం పట్టణానికి 46 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ చరిత్ర ప్రసిద్దిపొందిన ముఖలింగేశ్వరస్వామి,భీమేశ్వరస్వామి,సోమేశ్వరస్వామి ఆలయాలున్నాయి. ఆలయం అంతా చక్కని శిల్పాలతో కన్నుల పండుగగా ఉంటుంది.
ఈ దేవాలయాన్ని మధుకేశ్వరాలయం అని కూడా అంటారు. ఇక్కడ శివలింగం రాతితో చెక్కినదికాదు. ఇప్పచెట్టు మొదలును నరికివేయగా అదే ముఖలింగంగా ప్రసిద్దిపొందింది.ఆ చెట్టు మొదలుపై ముఖం కనిపిస్తుంది అని చెబుతారు.ఆ చెట్టుమొదలే క్రమంగా రాపడి లింగంగా మారిందని అందువలన ముఖలింగమని,సంస్కృతంలో ఇప్పచెట్టును మధుకం అంటారని అందువల్ల ఈ గుడికి మధుకేశ్వరస్వామి ఆలయం గా పేరోచ్చిందని అంటారు.
ఈ ఆలయంలో గర్భాలయం కాకుండా ఎనిమిదివైపులా ఎనిమిది లింగాలున్నాయి. ఇంకా కుమారస్వామి, దక్షిణామూర్తి,బ్రహ్మ,గణపతి విగ్రహాలున్నాయి. ఆలయాలన్నీ శిల్పకళతో శోభిళ్లుతుంటాయి. ఆలయం గోడలపై వరహవాతారం,వామనావతారం, సూర్యవిగ్రహం ఉండటం విశేషం. ప్రధాన ఆలయంతో పాటు చుట్టూ ఉన్న ఆలయాలన్నీ ఫొటోలు పెడుతున్నాను చూడండి,ఆలయం గోడలపై అనేక దేవతా మూర్తులను ఎంత అందంగా చెక్కారో ఆనాటి శిల్పులు.ఆలయమంతా ఒకరకమైన ప్రశాంతతో నిశ్శబ్ధంగా ఆ పరమేశ్వరుని ధ్యానముద్రలా ఉంటుంది.
సోమేశ్వారాలయానికి గర్భగుడి మాత్రమే ఉంది.ముఖమండపంలేదు.ఎత్తయిన శిఖరంపై బ్రహ్మండమైన రాతితో పైకప్పు వేశారు.ఇది ఒకే రాయి.ఒకసారి పిడుగుపడి ,ఆ రాయి పగిలి అందులో ఒక ముక్క క్రిందపడింది. ఆముక్కనే 50 మంది కలసి కదల్చలేకపోయారంటే ,మొత్తం రాయి ఎంతబరువు ఉంటుందో ఉహించుకొనవచ్చును. అంత ఆ రాయిని ఆ రోజుల్లో ఎలా ఎత్తారో,ఎలా అమర్చారో తలుచుకొంటే ఆనాటి శిల్పుల గొప్పదనం, ప్రజ్ణ మనకు అర్ధమవుతుంది.
ఇక్కడ అనేక శాసనాలు కూడా దొరికాయి.వాటిని బట్టి ఈ ఆలయాన్ని క్రీ.శ 10 వ శతాబ్ధంలో నిర్మించారని తెలుస్తుంది.
మహశివరాత్రికి ఇక్కడ గొప్ప ఉత్సవంగా జరుగుతుంది.