కొడుకుగా , పెళ్లి కొడుకుగా ఫెయిల్ అయ్యా .. నాకు కారుణ్య మరణం ప్రసాదించండి…


ఓ వైపు జీవితంలో స్థిరపడలేదనే ఆవేదన, మరోవైపు తల్లిదండ్రులను సరిగా చూసుకోలేకపోతున్నాననే బాధ. ఈ రెండూ ఒక ఎత్తయితే 35 ఏళ్లు పూర్తవుతున్నా పెళ్లి అవ్వడం లేదని ఇరుపొరుగు వాళ్లంటున్న సూటిపోటు మాటలు అతడిని కలచి వేశాయి. దీంతో చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. కారుణ్య మరణానికి అనుమతివ్వాల్సిందిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి ఓ యువకుడు లేఖ రాశాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ 15 రోజుల క్రితం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ కార్యాలయానికి పుణెకు చెందిన 35 ఏళ్ల యువకుడు లేఖ రాశారు. వృద్ధులైన తల్లిదండ్రులకు కొడుకుగా ఏమీ చేయలేకపోతున్నాని, కెరీర్‌లో సరిగా స్థిరపడలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికీ ఇంకా పెళ్లి కాలేదనే బాధ కూడా తనని తొలిచి వేస్తోందని తెలిపాడు. సీఎంవో ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు అతడికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నట్లు సీనియర్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ దేవిదాస్‌ తెలిపారు. సదరు వ్యక్తి బాగా చదువుకున్న వాడేనని, అయితే 70 ఏళ్ల తల్లిని, దాదాపు 83 ఏళ్ల తండ్రిని సరిగా చూసుకోలేక పోతున్నాననే బాధతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

About The Author