ఈ సీజన్ ఐపీఎల్ విజేత… ముంబై ఇండియన్స్…

* 149 పరుగులు చేసిన ముంబయి ఇండియన్స్
* ఒక్క పరుగు తేడాలో పరాజయం పాలైన ధోనీ సేన

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ విజేతగా నిలిచింది.

ఆఖరి బంతికి రెండు పరుగులు తీయాల్సిన సమయంలో చెన్నై ఆటగాడు మెక్ క్లింగన్ రనౌట్ కావడంతో ముంబయి 1 పరుగు తేడాతో విజయం సాధించింది.

మలింగ వేసిన చివరి ఓవర్లో చెన్నై విజయానికి 9 పరుగులు అవసరమైంది.

జట్టు స్కోరు 82 పరుగుల దగ్గర చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అవుట్ అయ్యాడు.
హార్దిక్ పాండ్యా వేసిన 12వ ఓవర్ ఐదో బంతికి వాట్సన్ రెండో పరుగు కోసం ప్రయత్నించగా, ఇషాన్ కిషన్ త్రోకు ధోనీ రనౌట్ అయ్యాడు. అయితే చాలాసేపు రీప్లేలు పరీక్షించిన థర్డ్ అంపైర్లు చివరికి ధోనీ అవుట్ అయినట్లు ప్రకటించారు.

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్ జోరుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. కానీ జట్టు స్కోరు 45 దగ్గర ఓపెనర్స్ ఇద్దరూ అవుటైపోవడంతో‌ కొంత కష్టాల్లో పడింది.

శార్దూల్ ఠాకూర్ వేసిన ఐదో ఓవర్ చివరి బంతికి 29 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్ వికెట్ కీపర్ ఎం.ఎస్ ధోనీకి క్యాచ్ ఇవ్వగా, తర్వాత ఓవర్ వేసిన దీపక్ చాహర్ మూడో బంతికి రోహిత్ శర్మ కూడా ధోనీకే క్యాచ్ అందించాడు.

కెప్టెన్ రోహిత్ శర్మ 15 పరుగులకే అవుటైపోవడం ముంబయి ఇండియన్స్ అభిమానులను నిరాశపరిచింది.

తర్వాత జట్టు స్కోరు 82 దగ్గర మూడో వికెట్ పడింది. సూర్యకుమార్ యాదవ్(15) ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్‌లో బోల్డ్ అయ్యాడు. మరో ఏడు పరుగుల తర్వాత కృణాల్ పాండ్య(7) కూడా భారీ షాట్ కొట్టబోయి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చాడు.

బంతి వేసిన తర్వాత కృణాల్ కొట్టిన షాట్‌ను అందుకోడానికి ముందుకు పరిగెత్తిన శార్దూల్ ఒకసారి అది మిస్సైనా రెండోసారి ఒడిసి పట్టాడు.

101 స్కోర్ దగ్గర ముంబయి ఇండియన్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్‌లో సురేష్ రైనాకు క్యాచ్ ఇచ్చాడు.

తర్వాత హార్డ్ హిట్టర్ కీరన్ పొలార్డ్, ముంబయి ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య జట్టు స్కోరును 140 వరకూ తీసుకొచ్చారు.

మంచి ఊపుమీద ఉన్న జట్టు స్కోరును పరుగులు పెట్టిస్తుందని భావించినా… అభిమానులకు దీపక్ చాహర్ మరోసారి షాక్ ఇచ్చాడు. దూకుడు పెంచాలనుకున్న హార్దిక్ పాండ్య(16) 19వ ఓవర్ మూడో బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. హార్దిక్ డీఆర్ఎస్ కోరినా ఫలితం లేకుండాపోయింది.

తర్వాత ఒక వైపు పొలార్డ్ ధాటిగా ఆడుతున్నా అతడికి తోడు నిలిచే బ్యాట్స్‌మెన్ కరువయ్యారు. రాహుల్ చాహర్, మిచెల్ మెక్ క్లింఘన్ ఇద్దరూ వెంటవెంటనే డకౌట్ అవ్వడంతో స్కోరు 150 పరుగుల లోపే ఉండిపోయింది.

అందరూ అవుటవుతున్నా పోరాట పటిమను చూపించిన కీరన్ పొలార్డ్ 25 బంతుల్లో 41 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 3 సిక్సర్లు, 3 పోర్లున్నాయి.

నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ముంబయి ఇండియన్స్ 8 వికెట్లు కోల్పోయి 149 మాత్రమే చేయగలిగింది.

About The Author