కులాల కుంపటి రాజేసేందుకు నేను సిద్ధం… మరి మీరు అంటున్న ఆర్జీవి…


కులాల కుంపటి రాజేసేందుకు నేను సిద్ధం… మరి మీరు అంటున్న ఆర్జీవి…

వివాదాల ‘జీవి’ గా పేరొందిన ఆర్జీవి అలియాస్ రాంగోపాల్ వర్మ… విజయవాడ వేదికగా మరో సారి తన వివాదాలకు పదును పెట్టాడు…

ఒకప్పుడు రాజకీయం గురించి అంతగా ఆశక్తి చూపని ఈ జీవి (అంటే గోపాల్ వర్మ…) ప్రస్తుతం రాజకీయాలే పరమావధిగా కొడిగట్టుతున్న తన ప్రతిభా ప్రాభవాన్ని తిరిగి నిలుపుకోవాలని చేస్తున్న ప్రయత్నం అంతా ఇంతా కాదు…

ఇప్పటివరకు తెరవెనుక ఉన్న కుల రాజకీయాలను… ఇప్పుడు తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తానంటున్న ఆర్జీవి… ఇంతటితో ఆగుతాడా అంటే ఖచ్చితంగా కాదు అని గతంలోనే చెప్పేసాడు…. ఏంటి గుర్తుకు రావట్లేదా…?

మొన్నా మధ్య కేసీఅర్ బయోపిక్ తీస్తానని తెగ హడావుడి చేసి, “వస్తున్నా ఆంధ్రోడా” అంటూ ఆర్జీవీ వదిలిన ఓ వీడియో గుర్తుకు వచ్చిందా….?

బాలకృష్ణ వ్యాఖ్యలతో… కలతచెందిన ఆర్జీవి ఊహలలో ఊపిరి పోసుకొన్నదే లక్ష్మీ’S NTR … సరే వాస్తవాలు ఏమిటో…? నిజ జీవిత పాత్రదారులకే ఎరుక…

లక్ష్మీ’S NTR సినిమా దేశవ్యాప్తంగా విడుదల అయినా… ఎన్నికల కమీషన్ పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్ లో విడుదలకు నోచుకోలేదు… పై పెచ్చు తన మానాన తను ప్రెస్‌మీట్ పెట్టుకొందామనుకొంటే… నగరంలోని హోటల్ నిర్వాహకులు సహకరించలేదు కావున నడిరోడ్డులో పెడతానంటూ హడావుడి చేయడం, అసలే రాష్ట్రంలో ఓ వైపు భగభగ మండుతున్న ఎండలు, మరోవైపు ఎన్నికల వేడి… ఈ నేపథ్యంలో విమానం దిగగానే అటునుంచటే మన వివాదాల ‘జీవి’ ని విజయవాడ పోలీసులు తిరిగు ప్రయాణం చేయించడం అందరికీ తెలిసిందే…

ఆ విధంగా అయిపోయిన పెళ్ళికి గట్టిగానే బాజాలు ఊదాడు వర్మ… అంటే అర్ధం కాలేదా…? ఓరి వెర్రిబాగుల్లారా..! ఆల్రెడీ విడుదలై పోయిన సినిమా… ఏపీ లో ఆగింది… అయినా సామాజిక మాధ్యమాల్లో సినిమా ఒరిజినల్ ప్రింట్ తెగ చక్కర్లు కొట్టింది,( అయితే ఈ ప్రింటు పైరసీ… చిత్ర నిర్మాణ దారుల పనే అన్న విమర్శా లేకపోలేదు…) కానీ ఆ సినిమానే మళ్ళీ ఇక్కడ మార్కెట్ చేయడమెలాగో అది ఒక్క ఆర్జీవీకే చెల్లు… దటీజ్ వర్మ… అన్నాడో తల పండిన సినీ విశ్లేషకుడు..‌

ఎప్పుడూ ఒక్కలా ఉండేవి అసలు రాజకీయాలే కావు… మారిన ఏపీ రాజకీయ ముఖ చిత్రంతో మళ్ళీ ఓ ఆట మొదలెట్టాడు మన వివాదాల ‘జీవి’… ఎందుకూ అంటారా…? అదేం పిచ్చి ప్రశ్న…? నిత్యం ఓ అలజడి, సందిగ్దంలో కొట్టుమిట్టాడే వారు ఇతరులను ప్రశాంతంగా ఎలా ఉండనిస్తారు…?

అలా మన వివాదాల ‘జీవి’ మొదలెట్టిన సరికొత్త ఆటే…

“కమ్మ రాజ్యంలో కడప రెడ్లు”

About The Author