అక్కమహాదేవి దివ్య చరిత్ర…

అక్కమహాదేవి దివ్య చరిత్ర -:

శ్రీశైల వాసుడిని భక్తితో కొలచి జీవితాన్ని ధన్యం చేసుకున్నవారు.. తమ జీవితాన్ని స్వామివారికే అంకితమిచ్చినవారు ఎందరో వున్నారు. అలాంటి వారిలో వీరరాగిణిగా ప్రసిద్ధి చెందిన అక్కమహాదేవి’ ఒకరు.

పన్నెండవ శతాబ్ధానికి చెందిన అక్కమహాదేవి గాథ – విచిత్రమైన గాథ. చిన్నతనం నుంచే చెన్నమల్లిఖార్జునున్ని పూజిస్తూ.. యుక్తవయస్సురాగానే చెన్నమల్లిఖార్జునున్ని తన భర్తగా భావించి తరించి.. చివరకు చెన్నమల్లిఖార్జునిలో ఐక్యమైన అక్కమహాదేవి మల్లికార్జునుడే తన సర్వస్వం అని భావించిన మహాభక్తురాలు.

అక్కమహాదేవి క్రీ.శ. 12 వ శతాబ్దానికి చెందిన మహిళ. ఆమె కర్నాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలోని ‘ఉడుతడి’ అనే గ్రామములో సుమతి, నిర్మల శెట్టి దంపతులకు జన్మించింది. నిర్మల శెట్టి దంపతులు వీరశైవులు. నిత్యం శివపూజలో మునిగి వుండేవారు. అటువంటి ఇంటిలో జన్మించిన అక్కమహాదేవికి చిన్నతనం నుంచే శివభక్తి అలవడింది. తల్లిదండ్రులు ఆమెకు ఒకవైపున విద్యను చెప్పిస్తూనే.. మరోవైపు వీరశైవ మతాచారం ప్రకారం లింగధారణ చేయించారు. శివదీక్ష సంస్కారాలన్నీ నేర్పించారు. యుక్తవయస్సు వచ్చాక ఆ భక్తి ప్రేమగా మారింది. చెన్న మల్లికార్జునుడే తన సర్వస్వం అని భావించింది.

ఒకనాడు అక్కమహాదేవి స్నేహితురాళ్ళతో కలిసి వీధు లలో ఆడుకుంటూ వుండగా .. ఆదారిన వెళ్తూ వున్న ఆ దేశరాజు ‘కౌశికుడు’ చూశాడు. అక్కమహాదేవి అందచందాలను, సౌందర్యాన్ని చూసి ముగ్ధుడైన కౌశికుడు ఆమెను వివాహం చేసుకోవాలని భావించాడు. ఈ విషయాన్ని ఆమెకు తెలిపి, ఆమెను అంగీకరింపజేయవలసిందిగా తన మంత్రులను అక్కమహాదేవి వద్దకు పంపాడు. మంత్రులు చెప్పిన మాటలను విన్న అక్కమహాదేవి- ‘శ్రీశైలనాథుడే నా సర్వస్వం. చెన్న మల్లికార్జునుడికి తప్ప మరొకరికి నా మనస్సులో స్థానం లేదు. కనుక చెన్న మల్లి కార్జునుడిని తప్ప మరొకరిని వివాహమాడను’ అని పలికింది.

మంత్రులు వెళ్ళి ఈ మాటలను కౌశికుడికి తెలిపారు. ఈ మాటలు విన్న రాజులో ఆవేశం అధికమైంది. బలవంతంగా అయినా సరే ఆమెను వివాహం చేసుకోవాలనే కోరిక అధికమ మైంది. ఈ విషయాన్నే మంత్రులకు చెప్పి వారిని అక్కమహాదేవి తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి చెప్పమన్నాడు. రాజాజ్ఞ ప్రకారం మంత్రులు అక్కమహాదేవి తల్లిదండ్రుల వద్దకు చేరుకుని విషయాన్ని తెలిపి.. ‘రాజుతో వివాహానికి అక్కమహాదేవి అంగీకరించకపోతే రాజదండనకు గురికావల్సి వస్తుందని’ మంత్రులు హెచ్చరించారు.

దీనితో అక్కమహాదేవి తల్లిదండ్రులలో భయందోళనలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో- ‘తల్లిదండ్రులారా! దిగులు చెందకండి… జైనమతానికి చెందిన కౌశికుడు వీరశైవుడుగా మారిన తర్వాత నేను వివాహం చేసుకుంటాను. నా గురించి దిగులు చెందకండి’ అని అక్కమహా దేవి తల్లిదండ్రులకు చెప్పి మంత్రులతో పాటు – రాజధానికి బయలుదేరింది.

అక్కమహాదేవి రాకను చూసిన కౌశికుడిలో ఆనందానికి హద్దులు లేవు. సంతోషంతో వెళ్ళి ఆమెను స్వాగతించాడు. రాజును చూస్తూనే అక్కమహాదేవి- ‘మహారాజా! మీరు జైన సంప్రదాయానికి చెందినవారు. నేను వీర శైవ మతానికి చెందిన దానిని. మీరు వీరశైవుడిగా మారినప్పుడే – నేను మిమ్ములను వివాహమాడతాను. అంత వరకూ నేన మీ రాజమందిరంలోనే వుంటాను. శివపూజలో వున్నంతకాలం మీరు నన్ను తాకరాదు. ఒకవేళ మీరు ఈ షరతును ఉల్లంఘిస్తే రాజభవనం నుండి ఏ క్షణాన్నైనా వెళ్ళిపోయేందుకు నాకు స్వేచ్ఛ వుంది’ అని పలికింది.

కౌశికుడు వెనుకాముందు ఏమీ ఆలోచించకుండా అందుకు అంగీకరించాడు.

అక్కమహాదేవి నిరంతరం శివపూజలో మునిగి ఉండేది. ఈ విధంగా కొన్ని రోజులు గడిచాయి. ఒకనాడు విసుగు చెందిన కౌశికుడు కామోద్రిక్తం వల్ల కళ్ళు మూసుకుపోయిన వాడై… షరతులను మరిచి అక్కమహాదేవి వద్దకు వెళ్ళి ఆమెను కౌగిలించుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే అక్కమహాదేవి తాను ధరించిన వస్త్రాన్ని తీసి రాజు ముఖంపై వేసి తన పొడవాటి జుట్టుతో శరీరాన్ని కప్పుకుని, రాజును నిందిస్తూ నిలుచుంది. వివస్త్రగా అక్కమహాదేవిని చూసిన కౌశికుడు కళ్ళముందు జైన తీర్థంకరులు దర్శనమిచ్చారు. ఫలితంగా జైనమతస్థుడు అయిన కౌశికుడు మోకాళ్ళపై ఆమె ముందు మోకరిల్లి నమస్కరించాడు. అనంతరం అక్కమహాదేవి రాజభవనాన్ని వదిలి వచ్చేసింది.

ఆ తర్వాత అక్కమహాదేవి కళ్యాణపట్టణానికి చేరుకుని అక్కడ వున్న అనుభవ మండపంలో కొంతకాలం గడిపింది. అనంతరం శ్రీశైలం చేరింది. స్వామివారిని దర్శించి పూజలు చేసింది. శ్రీశైలం సమీపంలోని ఒక గుహకు చేరుకుని శ్రీశైలవాసుడిని ఆరాధిస్తూ చివరివరకూ గడిపి అనంతరం శివుడిలో ఐక్యమైంది. కన్నడ, సంస్కృత భాషల్లో విశేష ప్రావీణ్య మున్న ఆమె – ‘అక్కమహాదేవి వచనాలు’ రచించింది. వాటికే ‘శివశరణాలు’ అని పేరు. ఈ వచనాల్లో భక్తి, జ్ఞాన, వైరాగ్య విషయాలు ప్రస్తావించబడ్డాయి. శ్రీశైలం నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో అక్కమహాదేవి నివశించి, శివుడిని ఆరాధించిన గుహలను నేటికీ దర్శించవచ్చు.

About The Author