ఇంట్లో మనం పెంచేది రాహుల్ గాంధీలను దేశానికి మాత్రం మోడీలు కావాలి….

ఏడేళ్ళ క్రితం రాహుల్ గాంధీ ఒక మాట చెప్పాడు,
“మా నాన్న రాజకీయాల్లో ఉన్నారు,మా నాయనమ్మ, ముత్తాత రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి నేను రాజకీయాల్లోకి రావటం చాలా సులువు అయ్యింది.కాని ఇదే నా అసలు సమస్య , ఈ సమస్యకి ప్రతిరూపం కూడా నేనే”

రాహుల్ గాంధీ ని ఇష్టపడే వారు కూడా అతను చాలా గారాబంగా పెరిగాడు , చిన్నప్పటి నుండి ఓ రక్షణ వలయంలో ఉన్నాడు, వాస్తవిక ప్రపంచం గురించి అవగాహన లేదు అని చెప్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే బోధి వృక్షం కింద కూడా కూర్చోలేని ఆధునిక సిద్ధార్ధుడు రాహుల్ గాంధి.ఇప్పుడు మన ఇంట్లో మనం కూడా రాహుల్ గాంధీ లనే పెంచుతున్నాం.

మనకి నరేంద్ర మోడీ అంటే ఓ అద్భుత వ్యక్తి,, కాని మన ఇంట్లో పెంచేది మాత్రం రాహుల్ గాంధిని. ఎందుకంటే మన పిల్లల్ని మనం పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ప్రయాణించనివ్వం, రోడ్డు పక్కన ఫుడ్ తిననివ్వం, వారికి బొద్దింక అంటే తెలియదు , నల్లులు ఎలా ఉంటాయో చూడరు. తెలుగు సరిగా మాట్లాడనివ్వం, ఎందుకుంటే మన భాష మాట్లాడితే మనకి నామర్దా. వాళ్లకి పేదరికం అంటే తెలియదు. పని వాళ్ళకి ఆజ్ఞలు జారీ చెయ్యటం తప్ప వాళ్ళతో మాట్లాడటం తెలియదు. ఎప్పుడూ కార్ లోనే తిరగటం, ఆ కార్ అద్దాల్లో నుండే ప్రపంచాన్ని చూడటం, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కార్ దగ్గరికి వచ్చి అడుక్కునే తమ వయసు పిల్లల్ని చూసి భయపడటం. ఇదేగా మనం నేర్పుతోంది ? ఈ రోజుల్లో పదేళ్ళ వయసున్న పిల్లలు కూడా ఏనాడు ఒంటరిగా షాప్ కి వెళ్లి కిరాణా సామాన్లు కొనుక్కురావటం చూడలేదు. ఒక్కసారి మీరు గుర్తుచేసుకోండి, ఏ వయసులో మీరు కిరాణా కొట్టుకి వెళ్లారు ? అమ్మ చీటీ రాసి ఇస్తే అవన్నీ జాగ్రత్తగా సంచి లో వేసుకుని లెక్క చూసుకుని వచ్చారు ? మరి అదే పని మీ పిల్లలు చెయ్యలేరా ? మీ తల్లిదండ్రులకి మీ మీద ఉన్న నమ్మకం మీకు పిల్లల మీద లేకపోవటానికి కారణం మీ పెంపకం మీద మీకున్న అపనమ్మకం. మీ తల్లిదండ్రులకి ఉన్నది తమ పెంపకం మీద ఉన్న నమ్మకం. 500 మీటర్ల దూరం లో ఉన్న ప్రదేశానికి కూడా GPS ట్రాకింగ్ పెట్టుకుని వెళ్తున్నారు, ఎందుకంటే తప్పిపోతారు అనే భయాన్ని పిల్లలలో మనమే సృష్టించి సొంతంగా ఆలోచించే అవకాశాన్ని వాళ్ళు కోల్పోయేలా చేస్తున్నాం. వయసుకు మించిన బరువుతో ఉండే పిల్లలు కనీసం వాళ్ల బరువులో సగం కూడా లేని పనివాళ్ళు బ్యాగ్ లు మోసుకుంటూ వాళ్ళ పక్కన నడుస్తుంటే ఇక పెద్దయ్యాక వాళ్ళకి బాధ్యత ఎలా తెలుస్తుంది ? జీవితంలోనూ , వృత్తి లోనూ క్లిష్ట పరిస్తితి ఎదురైనప్పుడు వాళ్ళెలా ఎదుర్కుంటారు ? మనకి మనమే ఓ కృత్రిమ దీవిని సృష్టించి మన తరువాతి తరాలని పనికిమాలిన వాళ్ళు గా తయారు చేస్తూ మనం మాత్రం రాహుల్ గాంధీ ని పప్పు అంటూ ట్రోల్ చేస్తాం వాహ్ క్యా బాత్ హై ? గాంధీ వంశపారంపర్య పరిపాలనకి వ్యతిరేకంగా గెలిచి చౌకిదార్ అని పిలిపించుకుంటున్న నాయకులు కూడా తమ ఇళ్ళలో పెంచేది రాహుల్ గాంధీ లనే. ఇలాగే కొనసాగితే ఇక భవిష్యత్తులో దేశం లో మేధో వలసలు తప్ప మేధావుల పోలరైజేషన్ ఉండదు. అంతెందుకు సమాజంలో మేధావులు , తమని తాము మలచుకుని విజేతలుగా ఎదిగిన వారు కూడా తమ పిల్లలకి తన మూలాలు నేర్పటం లేదు. తాము పడిన కష్టం తమ పిల్లలు పడకూడదు అనుకుంటున్నారు తప్ప తమ విజయానికి కారణం అయిన అసలు విషయాల్ని మరిచిపోతున్నారు. అలా అని ఒకడు రిక్షా తొక్కి పైకి వచ్చాడని తన పిల్లవాడిని రిక్షా తొక్కమని అర్ధం కాదు. కనీసం ఒకసారి రిక్షా ఎక్కించి అది తొక్కేవాడి కష్టాన్ని చూపించండి.

రాహుల్ గాంధీ స్వతహాగా మంచివాడు , కాని రాజకీయాల్లో రాణించాలన్నా జీవితంలో ధైర్యంగా, ఆనందంగా ఉండాలన్నా కావాల్సింది మంచితనం మాత్రమే కాదు, వాస్తవిక ప్రపంచం మీద అవగాహన, మన మూలాల గురించిన జ్ఞానం. ఈ అవగాహన ని అతని చుట్టూ ఉన్న పరిస్తితులు కల్పించలేకపోయాయి. ఇప్పుడున్న సమాజం లో rags-to-riches అనే కధలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అందుకే మనకి మోదీ ఒక అద్భుతంగా కనిపించాడు. ఇప్పుడు మన పిల్లలని నాయకులుగా ఎదగటానికి అవసరమైన పరిస్థితులని సమాజంలో కల్పించలేకపోతున్నాం.

పిల్లలు ఇప్పుడు పెరుగుతున్న విధానంలో Technology, business, arts, mainstream cinema లాంటి రంగాల్లో రాణించవచ్చు. ఎందుకంటే వారసత్వంగా సంక్రమించే రంగాల్లో నైపుణ్యం అనేది డబ్బు కింద పనిచేస్తుంది కాబట్టి. IIM లు IIT లు నిపుణులని తయారు చేస్తాయి, కాని నిపుణులు వేరు నాయకులు వేరు. వాస్తవిక మూలాలు తెలిసిన వాళ్ళు మాత్రమే నాయకులుగా ఎదుగుతారు. భారతదేశానికి ఆయువు పట్టు గ్రామాలు, అక్కడున్న మనుషులు ,వారి జీవితాలు. మీ కొడుకు ఏ రంగంలో అయినా నిపుణుడు అవ్వాలో నాయకుడు అవ్వాలో తేల్చుకోవాల్సింది మీరే.

ఈ కధనం రాహుల్ ని కించపరచటానికో లేక మోడీ ని ఆకాశానికెత్తటానికో రాసింది కాదు. వాస్తవానికి ఇద్దరి మీదా నాకు గౌరవం ఉంది. ఆరేళ్ళ క్రితం రాహుల్ తానింకా పెళ్లి చేసుకోనని ప్రకటించాడు. కారణం తనకి పెళ్లి మీద నమ్మకం లేక కాదు రేపు తనకి పుట్టే పిల్లలు తన స్థానం లోకి వచ్చి తనలాగే అవుతారని. మనకి అంత విశాల హృదయం లేదు కాబట్టి మన పిల్లలకి సమాజంలో వాస్తవిక జీవితాన్ని అలవాటు చేద్దాం.

అందాక ఎందుకు మొన్న జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన రాజకీయ నాయకుల వారసుల లిస్టు చూడండి. ఎవరికైనా గ్రామీణ నేపధ్యం ఉందా ? అసలు సాధారణ ప్రజాజీవితాన్ని ఎప్పుడైనా వాళ్ళు చూశారా ? రాజకీయాల్లో రాణించటానికి అవసరమైన మాతృభాషలో వాగ్ధాటి కలిగి ఉన్నారా ? “పెళ్లి ” అనే పదాన్ని “పెల్లి” అని కాకుండా పెళ్లి అన్ని ఒక్కరైనా పలకగలరా ? వారి ఓటమి కి కారణం వారి వైఫల్యం కాదు. వాళ్ళని నాయకులుగా తయారు చెయ్యలేని వాళ్ళ తల్లిదండ్రులది….
(Received via WhatsApp)

About The Author