సంతాన లేమికి మగవారిలో లోపాలే ఎక్కువ…


బిడ్డకు తల్లి లేదా తండ్రి కావడమనేది ఎంతో ఆనందించదగ్గ విషయం. దురదృష్టవశాత్తూ ప్రస్తుత జీవనశైలిని బట్టి ఇటీవలి కాలంలో చాలా దేశాలలో అదొక పెద్ద సవాలుగా మారింది భారతీయ జనాభాలో వంధ్యత్వం దాదాపు 10 నుంచి 14 శాతం మందిపై ప్రభావం చూపుతోంది. ఎటువంటి గర్భనిరోధక సాధనాలు వాడకుండా ఏడాది పాటు సంసార జీవితం గడుపుతున్నా సంతానం కలగకపోవడాన్ని వంధ్యత్వం అనవచ్చు.
ఇంచుమించు అన్ని వంధ్యత్వ కేసులలోనూ, 40 నుంచి 50 శాతం వరకు పురుషులలో వంధ్యత్వానికి సంబంధించినవే. సంతాన లేమితో బాధపడుతున్న చాలామంది పురుషులు దాంపత్య జీవనంలో తమకు ఎదురవుతున్న సవాళ్లను, సమస్యలను ఎవరికీ చెప్పుకోకపోవడం దురదృష్టకరం..
లైంగికపరమైన స్తబ్ధత, తక్కువస్థాయిలో వీర్యం ఉత్పత్తి కావడం. వీర్య ఉత్పత్తిలో అసాధారణ పరిణామాలు, లేదా వీర్యనాళాలలో బ్లాకేజీలు వంటివి వంధ్యత్వానికి ప్రధాన కారణాలు. జబ్బు పడటం, తీవ్ర గాయాల పాలుకావడం, అసాధారణమైన ఆరోగ్య సమస్యలు, జీవనశైలి లక్షణాలు, తదితరమైనవి పురుష వంధ్యత్వానికి దారితీసే మౌలికాంశాలు. సంతానలేమికి ఇతర కారణాలు
తక్కువ వీర్యకణాలు ఉండటం: వీర్యంలో మిల్లీలీటరుకు 15 మిలియన్ల కణాలకన్నా తక్కువ ఉండటాన్ని తగినన్ని వీర్యకణాలు లేకపోవడంగా పరిగణింపవచ్చు. సంతానం లేని దంపతులలో దాదాపు మూడవ వంతుమంది జంటలకు తక్కువ వీర్యకణాల వల్లనే సంతానం కలగడం లేదు.
వీర్యకణాల కదలిక తక్కువగా ఉండడం: వీర్యంలోనుంచి వీర్యకణాలు అండాన్ని చేరి, ఫలదీకరణ చెందాలంటే కణాలు చురుకుగా కదలాలి. కణాలు ఈదలేకపోతే ఫలదీకరణ జరగదు.
అసాధారణమైన వీర్యం: వీర్యకణాలకు సరైన ఆకారం లేకపోవడం వల్ల అండంలోనికి చొచ్చుకుపోలేకపోవడాన్ని అసాధారణమైన వీర్యంగా చెప్పవచ్చు.
పురుషులలో వంధ్యత్వానికి దారితీసే ఇటువంటి పరిణామాలకు వృషణాలకు ఇన్ఫెక్షన్‌ సోకడం లేదా విపరీతమైన వేడిమికి గురవడం, వెరికోసిల్, హార్మోన్ల అసమతుల్యత, జన్యుపరమైన కారణాలు, క్యాన్సర్, శస్త్రచికిత్సలు మొదలైన కారణాలు ఉండవచ్చు.
సాఫల్యానికి సలహాలు
తగినంత నీటిని తాగడం, పిల్లలకోసం ప్రయత్నించడానికి కనీసం రెండు మూడు నెలల ముందు నుంచి ధూమపానాన్ని మానివేయడం, పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే టొమాటో, చిలకడ దుంపలు, పుచ్చ, గుమ్మడి, క్యారట్లు, చేపలు, వాల్‌నట్స్, బ్లూ బెర్రీస్, దానిమ్మ, డార్క్‌ చాకొలేట్స్‌ వంటి వాటిని తినడం మంచిది.

About The Author