సచివాలయంలో హోంమంత్రిగా బాద్యతలు తీసుకున్న సుచరిత…


ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి అనుమతితో రాష్ట్రంలో త్వరలో మహిళ, గిరిజన పోలీస్ బెటాలియన్లు ఏర్పాటు చేయనున్నట్లు హోమ్, విపత్తుల నిర్వహణ శాఖల మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. సచివాలయం 2వ బ్లాక్ లో ఆదివారం ఉదయం ఆమె తన ఛాంబర్ లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ కానిస్టేబుల్ మెడికల్ రీయింబర్స్ మెంట్ ఫైల్ పై మంత్రి తొలి సంతకం చేశారు. అంతకు ముందు భర్త దయాసాగర్ తో కలసి వచ్చిన మంత్రికి వేద పండితులు వేద మంత్రాలు, మేళతాళాలతో స్వాగతం పలికారు. ఛాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత మంత్రి బాధ్యతలు స్వీకరించారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత గురువులు వేద మంత్రాలు, ప్రార్ధనలతో మంత్రిని దీవించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రంలో నాలుగు బెటాలియన్లు ఏర్పాటు చేసే అవకాశం వచ్చిందని తెలిపారు. వాటిని ఇంతవరకు ఏర్పాటు చేయలేదని చెప్పారు. వాటిలో ఒకటి మహిళా బెలాలియన్, మరొకటి గిరిజన బెటాలియన్ ఏర్పాటు చేస్తామన్నారు. బాబా సాహేబ్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్, సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డి వల్ల తాను ఈ పదవిని చేపట్టినట్లు తెలిపారు. దళిత మహిళనైన తనకు బాధ్యత గల హోమ్ మంత్రి పదవి ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షించవలసిన బాధ్యత పోలీస్ శాఖపై ఉందన్నారు. మహిళలు, చిన్నారులపై జరిగే అత్యాచారాలు అరికట్టడానికి, అటువంటి సంఘటనలు జరుగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీస్ వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి, పోలీసులు కూడా వారానికి ఒక రోజు తమ కుటుంబాలతో ఆనందంగా గడపడానికి వీక్లీ ఆఫ్ ని తప్పనిసరిగా అమలు చేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. 2018 రిక్రూట్ మెంట్ కు సంబంధిచిన ఫలితాలు త్వరలో ప్రకటిస్తామన్నారు. పోలీస్ శాఖలోని ఇతర ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేష్ విడుదల చేస్తామని చెప్పారు. మహిళలు గానీ, ఇతర బాధితులు గానీ భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ ని ఏర్పాటు చేస్తామన్నారు. బాధితుల కష్టాలు చెప్పుకునేందుకు ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను రూపొందిస్తామని చెప్పారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందిన తరువాత చర్యలు తీసుకోవడానికి ఒకటి, రెండు రోజులు సమయం ఇవ్వాలని మీడియాకు సూచించారు. తాను మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఒక బాధితురాలి తల్లి అనంతపురం నుంచి ఫోన్ చేసి నాలుగు నెలల క్రితం జరిగిన ఒక సంఘటనపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఫాస్టర్ ఓ చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆమె చెప్పినట్లు తెలిపారు. వెంటనే తాను అధికారులకు విషయం తెలిపి విచారించి, తగిన చర్యలు తీసుకోమని చెప్పానన్నారు. పోలీసులు వెళ్లేసరికి ఫాసర్ట్ పారిపోయారని తెలిపారు. ‘‘వెంటనే చర్యలు తీసుకోలేకపోయారు. అసమర్థులు’’ అన్నట్లు కొందరు మీడియా వారు రాశారని చెప్పారు. ఆ తరువాత రెండు రోజులకు ఆ ఫాస్టర్ ని అరెస్ట్ చేసి, రిమాండ్ కు పంపారని తెలిపారు. ఫిర్యాదు అందిన తరువాత చర్యలు తీసుకునే సమయం ఇవ్వకుండా ఆ విధంగా రాయడమేమిటని ఆమె ప్రశ్నించారు. తొందరపడకుండా ఫిర్యాదు అందిన తరువాత కొద్దిగా సమయం ఇవ్వాలని మంత్రి సుచరిత మీడియా వారిని కోరారు. ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షల మేరకు తాము పని చేస్తామని మంత్రి చెప్పారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంత్రి సుచరితకు పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, లా అండ్ ఆర్డర్ అడిషన్ డీజీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్, ఎస్పీ డాక్టర్‌ గజరావు భూపాల్‌, ఇతర అధికారులు, నాయకులు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు.మరి కొందరు మంత్రి దంపతులను శాలువలతో సత్కరించారు.

About The Author