అన్నారం బరాజ్ @ 1.97 టీఎంసీలు…

-కన్నెపల్లి నీటి చేరికతో నిండుతున్న బరాజ్
-మూడు మోటర్లతో జలాల ఎత్తిపోత
-నేడు ఐదు మోటర్ల ద్వారా తరలింపు
-మేడిగడ్డ అన్నిగేట్లు మూసివేత
-3.3 టీఎంసీల నీరు నిల్వ
-కొనసాగుతున్న ప్రాణహిత వరద
-దేవాదుల వద్ద 74.7 మీటర్ల ప్రవాహం
-తాలిపేరు గేట్లు ఎత్తివేత

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంపుహౌస్ నుంచి మోటర్ల ద్వారా ఎత్తిపోస్తున్న గోదావరి నీటితో అన్నారం బరాజ్‌లో నీటిమట్టం పెరుగుతున్నది. కన్నెపల్లి నుంచి అన్నారం బరాజ్‌లోకి గురువారం సాయంత్రానికి 1.97 టీఎంసీల జలాలు చేరుకున్నాయి. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. దీంతో గోదావరిలోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద ఇంజినీర్లు ఒక్కో మోటర్‌ను ప్రారంభించి అన్నారం బరాజ్‌కు తరలిస్తున్నారు. పంపుహౌస్‌లో 3వ, 6వ మోటర్లు నిరంతరాయంగా నడుస్తుండగా, 4వ నంబర్ మోటర్‌ను ఉదయం 9.00 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు నడిపి బంద్‌చేశారు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ ఆన్‌చేశారు. శుక్రవారం నుంచి కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి అ న్నారం బరాజ్‌కు ఐదుపంపుల ద్వారా గోదావరి నీటిని తరలించనున్నట్టు అధికారులు తెలిపారు. కాళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం 9,500 వేలుగా ఉన్నదన్నారు. అన్నారం బరా జ్ నుంచి 35 కిలోమీటర్ల దూరం ఎదురెక్కిన గోదావరి జలాలు మంథని తీరా నికి చేరాయి. Annaram-Barrage1
మేడిగడ్డ 85 గేట్లు మూసివేత
మేడిగడ్డ బరాజ్‌లో అధికారులు మొత్తం 85 గేట్లనూ మూసివేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తూ గోదావరిలోకి భారీగా వరద చేరుతున్నది. వరదతోపాటు, మహదేవపూర్ మండలంలో వర్షం కురియడంతో బరాజ్‌లోకి గురువారం 3.3 టీఎంసీల నీరు వచ్చి చేరింది.
దేవాదుల వద్ద తగ్గుతున్న నీటిమట్టం
దేవాదుల వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఎగువప్రాంతాల్లో కురిసిన వర్షాలతో దేవాదుల ఇన్‌టేక్ వెల్ వద్ద గోదావరి నీటిమట్టం 75 మీటర్లకుపైగా చేరుకుని ప్రవహించిన విషయం తెలిసిందే. రెండురోజులుగా నీటిమట్టం క్రమంగా తగ్గుతున్నది. భద్రాచలం వద్ద గురువారం ఉదయం 15.8 అడుగులుగా ఉన్న గోదావరి సాయంత్రం 6 గంటలకు 15.3 అడుగులకు చేరుకున్నది. నేడు Annaram-Barrage2 తాలిపేరు కాల్వలకు నీటి విడుదల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మధ్యతరహా సాగునీటిప్రాజెక్టు తాలిపేరుకు వరదపోటెత్తింది. డ్యాంలోకి వచ్చే ఇన్‌ఫ్లోతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు 73.60 మీటర్ల మేర నీటిని నిల్వచేస్తూ.. అదనంగా వస్తున్న నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. గురువారం ఉదయం మూడు క్రస్ట్ గేట్లను రెండు అడుగులు ఎత్తి 4,392 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.
ఆల్మట్టికి పెరిగిన వరద

ఆల్మట్టికి వరద ప్రవాహం పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో గురువారం సాయంత్రానికి 1.10 లక్షల క్యూసెక్కులకు చేరినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆల్మట్టిలో నీటిమట్టం 64 టీఎంసీలకు పెరిగింది.
మహాద్భుత సృష్టికర్త కేసీఆర్
-104 కిలోమీటర్ల గోదావరి తీరంలో జలసంబురం -గోదావరికి మంత్రి కొప్పుల పూజలు

ప్రపంచ చరిత్రలోనే ఎక్కడాలేనివిధంగా రీడిజైనింగ్ పద్ధతిలో ప్రాణహిత నుంచి గోదావరి నీటిని ఎదురెక్కించే మహాద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు సృష్టికర్త ముఖ్యమంత్రి కేసీఆర్ అని సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని గోదావరి తీరానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎదురెక్కిన జలాలకు పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టమధు, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్, సీపీ సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్‌తో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు, కుంకుమ, సారె, పుష్పాలు సమర్పించి గోదావరి మాతకు హారతినిచ్చి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి జలాలను తెలంగాణ బీళ్లకు మల్లించాలనే తపనతో అహోరాత్రుల శ్రమకు ప్రతిరూపమే కాళేశ్వరం ప్రాజెక్టు అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ బ్యారేజీని పూర్తి చేసుకొని కన్నెపల్లిలో పంపింగ్ పనులు ప్రారంభం కావడంతో ప్రాజెక్టు కల సాకారమయ్యిందన్నారు. కాళేశ్వరం నుంచి ఎదురెక్కుతున్న నీళ్లతో ఎల్లంపల్లి నుంచి మేడిగడ్డ వరకు ఉన్న 104 కిలోమీటర్ల గోదావరి తీరం నిండు కుండలా మారబోతున్నదన్నారు. తెలంగాణ రావడం ఎంత నిజమో.. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు కూడా ఎదురెక్కుతుండటం అంతే నిజం అని చెప్పారు.

About The Author