శ్రీ కోదండరామాలయంలో ఘనంగా ఆణివార ఆస్థానం
తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో బుధవారం సాయంత్రం ఆణివార ఆస్థానం ఘనంగా జరిగింది. ఆలయంలోని గరుడాళ్వార్ ఎదురుగా శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరాములవారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ప్రత్యేకంగా ఆస్థానం నిర్వహించారు.
ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆణివార ఆస్థానం అని పేరు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టిటిడి వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టిటిడి ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్ను మార్చి – ఏప్రిల్ నెలలకు మార్చారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్, ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పి.వరలక్ష్మీ, ఏఈవో శ్రీ తిరుమలయ్య, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ రమేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు.